తమిళ ప్రజలను అవమానించడమే

తమిళ ప్రజలను అవమానించడమే

చెన్నై: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం తాళం చెవులు కనిపించడం లేదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తాళాలు ఒడిశా నుంచి తమిళనాడుకు చేరుకున్నాయని మోడీ ఆరోపించడం తమిళ ప్రజలను అవమానించడమేనని స్టాలిన్ తప్పుబట్టారు. ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో పర్యటించిన మోడీ.. ఓట్ల కోసం తమిళనాడు ప్రజలను పొగిడారు. కానీ, రత్న భాండాగారం తాళం చెవులు తమిళనాడుకు చేరుకున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు అటు పూరిజగన్నాథుడిని, ఇటు తమిళ ప్రజలను కించపరిచేలా ఉన్నాయి. ఆయన ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. కేవలం ఓట్లు పొందేందుకే ప్రధాని ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఆయన వైఖరిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’ అని స్టాలిన్ పేర్కొన్నారు. ఆలయంలోని నిధిని తస్కరించారని తమిళ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని ఎలా మాట్లాడతారని ఆయన నిలదీశారు. మోడీ ఇలాంటి వ్యాఖ్యలతో మొత్తం తమిళనాడును అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ నాయకుడంటే రాష్ట్ర ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించాలే కానీ, ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగాలతో శతృత్వాన్ని సృష్టించేలా కాదని హితవు పలికారు. అసలు ఆయనకు తమిళులపై ఇంత ద్వేషం ఎందుకు? ఇకనైనా ఓట్ల కోసం రాష్ట్ర ప్రజలను కించపరచడం మానుకోవాలని స్టాలిన్ హితవు పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos