ఆందోళనలు ఉద్ధృతం- విపక్షాల మద్దతు

ఆందోళనలు ఉద్ధృతం- విపక్షాల మద్దతు

న్యూ ఢిల్లీ:నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇక్కడ రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. ఎనిమిదో రోజూ నిరసనలు చేపట్టారు. సమస్య పరిష్కారానికి పలు దఫాలుగా కేంద్రం చర్చలు చేపట్టినా సానుకూల ఫలితం కనిపించటం లేదు. చట్టాల రద్దు తప్ప మరేదీ సమ్మతం కాదని రైతు సంఘాలు కుండబద్దలు కొట్టాయి.వారికి విపక్షాలు, వివిధ వర్గాల మద్దతు లభిస్తోంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కేంద్రం వైఖరికి నిరసనగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు. రైతులు తీవ్రమైన చలిని సైతం లెక్కచేయక తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్నారని పేర్కొన్నారు. నూతన సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయటం మినహా అంతకు తక్కువగా ఏదైనా అంగీకరించినట్లయితే అది దేశానికి, రైతులకు ద్రోహం చేయటమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కేంద్ర హోంమంత్రితో సమావేశమైన దశలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేతఅధిర్ రంజన్ చౌదరి కూడా రైతులకు మద్దతుగా నిలిచారు. రైతులను బుజ్జగించే విధానాలను వీడి.. సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు తగిన గౌరవం, మర్యాదలు ఇవ్వాలన్నారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమత బెనర్జి హెచ్చరించారు. ‘రైతులు, వారి జీవితాలపై ఆందోళన చెందుతున్నా. కేంద్రం రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలి. వెంటనే చర్యలు తీసుకోకపోతే.. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం. డిసెంబర్ 4న అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పలు చట్టాలపై చర్చించనున్న’ట్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos