సౌర కంచెతో తగ్గిన ఏనుగుల బెడద

సౌర కంచెతో తగ్గిన ఏనుగుల బెడద

హొసూరు : తమిళనాడు – కర్ణాటక సరిహద్దు తళి సమీపంలోని జవులగిరి అటవీప్రాంతంలో సౌర కంచె ఏర్పాటు చేయడంతో పంట పొలాలకు ఏనుగుల బెడద తగ్గింది. ఏటా ఆక్టోబరులో బెంగళూరు శివారులోని బన్నేరుఘట్ట అటవీ ప్రాంతం నుంచి హొసూరు అటవీ ప్రాంతానికి వచ్చే వలస ఏనుగులకు చెక్ పడింది. బన్నేరుఘట్ట అటవీ ప్రాంతం నుంచి హొసూరు సమీపంలోని సానమావు ఆటవీ ప్రాంతానికి ఏటా వందకు పైగా ఏనుగులు రావడం ఆనవాయితీ. అక్టోబరు నెలలో వచ్చే ఏనుగుల మంద సానమావు అటవీ ప్రాంత గ్రామాలైన పాతకోట, రామాపురం, పోడూరు తదితర గ్రామాల్లో వరి పంటలను నాశనం చేస్తున్నాయి. కెలవరపల్లి డ్యాం ఆయకట్టు ప్రాంతం కావడంతో సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా వరి పంట అక్టోబర్ నెలలో కంకి దశకు చేరుకొనే సమయంలో వలస ఏనుగులు పంటను నాశనం చేస్తున్నాయి. తద్వారా రైతులు తీవ్రంగా
నష్టపోతున్నారు. వలస ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడాలని హొసూరు డెంకణీకోట ప్రాంత రైతులు అటవీ శాఖ అధికారులకు మొరపెట్టుకొనే వారు. వలస ఏనుగులను నియంత్రించడానికి అధికారులు చర్యలు చేపట్టి జవులగిరి అటవీ ప్రాంతంలో సుమారు అయిదు కి.మీ. మేర సౌర కంచెను ఏర్పాటు చేశారు. దీని వల్ల పంట పొలాలపై పడకుండా ఏనుగులను నియంత్రించినట్లయింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు .నెల రోజుల పాటు వలస ఏనుగులను ఇదే విధంగా నియంత్రిస్తే వరి పంట కోతలు పూర్తి చేస్తామని రైతులు తెలిపారు. ప్రస్తుతం వలస ఏనుగులు హొసూరు అటవీ ప్రాంతానికి చేరుకునే మార్గం లేక జవులగిరి అటవీ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos