రచ్చకెక్కిన శ్రీలంక క్రికెట్

రచ్చకెక్కిన శ్రీలంక క్రికెట్

కొలంబో: శ్రీలంక క్రికెట్‌ సంక్షోభం దిశగా పయనిస్తోంది! ఆటగాళ్లలో బృంద స్ఫూర్తి కొరవడింది. బోర్డు సభ్యుల్లో అవినీతి ఎక్కువైంది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణాలు, అనుమానాలతో ఐసీసీ వరుసగా దర్యాప్తులు నిర్వహిస్తోంది. క్రికెటర్లు బాహాటంగానే ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వన్డే ప్రపంచకప్‌ కోసం మేలో ఇంగ్లాండ్‌ వెళ్తున్న లంక ఘోర పరాభవాన్ని ఎదుర్కోనుందని మాజీ సారథి అర్జున రణతుంగ హెచ్చరించారు. ‘బోర్డులో అవినీతి జరుగుతోంది. ఆటగాళ్లలో స్ఫూర్తి కొరవడింది. ఒకరినొకరు బాహాటంగా తిట్టుకుంటున్నారు’ అని రణతుంగ అన్నారు. ప్రస్తుతం జట్టు ఘోర ప్రదర్శనలకు జాతీయ క్రికెట్‌ బోర్డు, కొంతమంది ఆటగాళ్లే కారణమని ఆయన తెలిపారు. ఆటగాళ్లలో క్రమశిక్షణ పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచకప్ లీగ్‌దశలోనే శ్రీలంక వెనుదిరిగి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏదేమైనప్పటికీ జట్టులో ప్రేరణ పెంపొందించి మానసికంగా బలవంతులను మార్చేందుకు శిక్షణ ఇవ్వాలని రణతుంగ సూచించారు. కొంతమంది ఆటగాళ్లు దేశం కోసం కాకుండా వ్యక్తిగత లాభం కోసం ఆడుతున్నారని విమర్శించారు. వారిని వెంటనే తరిమేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక టీ20 సారథి లసిత్‌ మలింగ, తాత్కాలిక సారథి తిసారీ పెరీరా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. లంక బోర్డు వీరిని హెచ్చరించినా మారకపోవడం గమనార్హం. ప్రస్తుతం శ్రీలంక రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న రణతుంగ క్రికెట్‌ బోర్డులో పగ్గాలు చేపట్టాలని పట్టుదలతో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos