ఇంద్రుడి గద్దె ఇచ్చినా కమలంతో కలవం

ఇంద్రుడి గద్దె ఇచ్చినా కమలంతో కలవం

ముంబై: ఇంద్రుడి సింహాసనాన్ని ఇస్తామన్నా భాజపాతో కలిసేది లేదని శివసేన నేత సంజయ్ రౌత్ శుక్రవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా నుంచి మళ్లీ ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు. ఇకపై బేరసారాలకు తావు లేదు. భాజపాతో జట్టుకట్టేది లేదు. ఇంద్రుడి సింహాసనాన్ని ఇస్తామన్నా భాజపాతో కలిసేది లేద’ని తేల్చి చెప్పారు. ‘కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంలో శివసేన నేతే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇది మహారాష్ట్ర ప్రజల ఆకాంక్ష’న్నారు. ‘రాష్ట్రపతి పాలన అమలులో ఉండగా గవర్నర్ని కలిసేది ఎందుక’ని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ‘ఆత్మగౌరవం కోసం ఒక్కోసారి బంధాల్ని తెంచుకోవడమే మంచిద’నీ అని ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు తమతో కలిసిన ఇతర చిన్న పార్టీలతో కాంగ్రెస్,ఎన్సీపీ నాయకులు సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుకు వారి మద్దతు కోరనున్నారు. వివిధ పార్టీల చేరికతో ఏర్పాటవుతున్న కొత్త కూటమికి ‘మహా వికాస్ ఆఘాడీ’గా నామకరణం చేసే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos