థర్డ్ పార్టీ ఫియర్ : తెలంగాణ పోలీసులపై నిఘా..

థర్డ్ పార్టీ ఫియర్ : తెలంగాణ పోలీసులపై నిఘా..

మీరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారా… అయితే కేసు నమోదు చేయడంలో జాప్యం చేయడం గానీ.. లేక పోలీసులు సరిగ్గా స్పందించకపోవడం జరుగుతోందా.. అయితే అలాంటి పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పోలీసుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదిక ఇవ్వాల్సిందిగా థర్డ్ పార్టీకి బాధ్యతలు అప్పగించింది. ప్రజలకు భరోసా ఇవ్వడం కోసమే ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
తెలంగాణ పోలీసుల పనితీరుపై నిఘా..
తెలంగాణ పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే దానిపై దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలంటే ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కనుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇకపై ఆ తిప్పలు అవసరం ఉండదు. ఫిర్యాదు నమోదు అయిన వెంటనే ముందుగా ఫిర్యాదుదారుడి మొబైల్ నంబరుకు ఎఫ్‌ఐఆర్ నంబరుతో సహా ఎస్ఎంఎస్ వెళుతుంది. దీంతో పాటే డీజీపీ కార్యాలయానికి కూడా సమాచారం వెళుతుంది.అంతేకాదు కేసు ఎంతవరకు వచ్చింది ఆ కేసు అప్‌డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ తరహా విధానం హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్లకే పరిమితం కాగా… ఈ ఏడాది ఒకటో తేది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.
దేశంలోనే తొలిసారిగా..
పోలీసులు ఎలా పనిచేస్తున్నారో.. వారి పనితీరుపై ఎప్పటికప్పుడు థర్డ్ పార్టీ ద్వారా రిపోర్టు తెప్పించుకునే ప్రక్రియ తెలంగాణ పోలీసు శాఖ ప్రారంభించింది. దేశంలో ఇలాంటి ప్రక్రియ ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఫిర్యాదుదారుడు ఫిర్యాదు నమోదు చేయాలంటే తప్పనిసరిగా తన ఫోన్‌నెంబరును జతచేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఫిర్యాదుదారుడి ఫోన్‌నెంబరుకు ముందుగా మెసేజ్ వెళుతుంది. అదే ఫోన్ నెంబరు డీజీపీ కార్యాలయానికి వెళుతుంది. ఫలానా కేసును పోలీసులు ఎలా డీల్ చేస్తున్నారనేదానిపై స్టడీ చేసేందుకు థర్డ్ పార్టీకి కూడా కేసు వివరాలు వెళతాయి.
థర్డ్ పార్టీ ఫీడ్ బ్యాక్..
ఇక బాధితుడు కేసు నమోదు చేయగానే థర్డ్ పార్టీ రంగంలోకి దిగుతుంది. థర్డ్ పార్టీ సభ్యులు బాధితుడికి ఫోన్ చేసి పోలీసులు ఫిర్యాదు పట్ల ఎలా వ్యవహరించారనే సమాచారాన్ని తెలుసుకుంటారు. స్టేషన్‌ అధికారులు ఎలా వ్యవహరించారు? పోలీసుల నుంచి సేవలు ఎలా అందుతున్నాయి? ఏవైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా!? దర్యాప్తు అధికారి తీరు ఎలా ఉంది? దర్యాప్తు తీరుపై సంతృప్తికరంగానే ఉన్నారా? అని ప్రశ్నలు వేస్తారు.బాధితుడు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ద్వారా కేసును డీల్ చేస్తున్న పోలీసులకు లేదా పోలీస్ స్టేషన్‌కు గ్రేడింగ్ ఇస్తారు. ఇది భవిష్యత్తులో వారి ప్రమోషన్లలో, బదిలీలలో కీలకంగా మారనుంది.
బాధితుడికి థర్డ్ పార్టీ ప్రశ్నలు..
ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌పై పోలీస్ ఉన్నతాధికారులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. బాధితుడిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా… ఫిర్యాదు స్వీకరించకపోయినా చర్యలు తీసుకుంటారు. ఒకసారి యాక్షన్ తీసుకుంటే మరోసారి ఇలాంటి తప్పులు పునరావృతం కావని పోలీస్ పెద్దలు చెబుతున్నారు. ఇలాంటి సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఒకేలా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఇక పెండింగ్‌లో ఉన్న పాత కేసులపై కూడా అధికారులు పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాలకు తమ సిబ్బందిని విచారణకు పంపిస్తున్నారు.
థర్డ్ పార్టీ నివేదికతో నిజాయితీ పోలీసులకు తప్పని కష్టాలు..
అయితే థర్డ్ పార్టీ పద్ధతిపై పోలీసులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ థర్డ్ పార్టీ విధానంతో నిజాయితీతో పనిచేసే పోలీసులు బలయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక నిజాయితీ ఆఫీసర్‌ను రాజకీయనాయకుడు లక్ష్యం చేసుకుని ఆయనపై తప్పుడు ఫీడ్ బ్యాక్ ఇస్తే సదరు పోలీసు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరగకుండా ప్రభుత్వం చూస్తే బాగుంటుందని వారు చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos