ఉచిత రైలు ప్రయాణంపై కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ

ఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలకు ఉచిత మెట్రో రైలు ప్రయాణం కల్పించాలన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం గట్టిగా నిలదీసింది. ఈ పథకం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కు ఏమాత్రం లాభదాయకం కాదని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని సక్రమంగా ఖర్చు చేయాలని, ప్రజలకు ఉచిత తాయిలాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. అన్ని టీటీసీ బస్సులు, క్లస్టర్ బస్సులు, ఢిల్లీ మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలనుకుంటున్నట్టు ఈ ఏడాది జూన్‌లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. దీనిపై ప్రజల నుంచి సలహాలు, ఇతర సమాచారం తీసుకుని రెండు మూడు నెలల్లో అమల్లోకి తెస్తామని చెప్పారు. కాగా ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు నాలుగో దశ విస్తరణకు సంబంధించి న్యాయవాది ఎంసీ మెహతా పిటిషన్‌పై శుక్రవారం విచారణ సందర్భంగా, మహిళలకు మెట్రో రైళ్లలో ఉచిత ప్రయాణంపై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో మెట్రో రైల్ 4వ దశకు సంబంధించి భూమి కొనుగోలుకు అవసరమైన రూ.2,447.19 కోట్ల విడుదల, విధివిధానాలను వారం రోజుల లోగా రూపొందించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos