మూగబోయిన శాక్సాఫోన్

మూగబోయిన శాక్సాఫోన్

మంగళూరు : ప్రముఖ శాక్సాఫోన్ విద్వాంసుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కదిరి గోపాల్‌నాథ్‌(69) కన్నుమూశారు. కర్ణాటకలోని మంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంగీత ప్రపంచంలో శాక్సాఫోన్‌తో అద్భుతాలు సృష్టించిన గోపాలనాథ్. స్వదేశంలోనే కాకుండా ఐరోపా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంక, పశ్చిమాసియా దేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చి సంగీత ప్రియుల నీరాజనాలందుకున్నారు. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్ ఆల్బర్ట్ హాలులో కచేరీ చేసిన అతి కొద్ది మంది కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ఈయన ఒకరు. మంగళూరు, బెంగళూరు విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు సహా అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. కదిరి గోపాల్‌నాథ్‌ మరణం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గోపాల్‌నాథ్‌ అంత్యక్రియలు శనివారం మంగళూరులో జరగనున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos