ఉత్తరకన్నడ పర్యాటక సిగలో మరో అద్భుతం సతోడి..

  • In Tourism
  • December 18, 2019
  • 244 Views
ఉత్తరకన్నడ పర్యాటక సిగలో మరో అద్భుతం సతోడి..

అంతులేని ప్రకృతి అందాలకు,జలపాతలకు అరుదైన వన్యప్రాణులు,పక్షులు మరెన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలకు శాశ్వత చిరునామాగా విరాజిల్లుతూ ప్రతిరోజూ ప్రకృతి ప్రేమికులను,పర్యాటకులను రారమ్మని ఆహ్వానించే ఉత్తరకన్నడ జిల్లాలోని పచ్చనైన పశ్చిమ కనుమల్లో మరో అద్భుత పర్యాటక ప్రాంతం సతోడి జలపాతాలు,కద్రా,కొదసలి ఆనకట్టలు.చాలా కాలం వరకు బయటిప్రపంచానికి తెలియని యల్లాపూర్‌ సమీపంలోని సతోడి జలపాతాలను కొద్ది సంవత్సరాల క్రితం స్థానికుల కనుగొనడంతోనే బయటిప్రపంచానికి తెలిశాయి.అప్పటి నుంచి అటవీప్రాంతంలో ట్రెక్కింగ్‌ చేసి ఈ జలపాతాలను చేరుకొని ప్రకృతి ఒడిలో మైమరచిపోవడానికి ప్రతిరోజూ పర్యాటకులు తరలివస్తున్నారు.కల్లరమనే ఘాట్‌ సమీపంలో అనేక చిన్నచిన్న ప్రవాహాల సమూహాలు కలసిపోయి సతోడి జలపాతంగా ఏర్పడతాయి. దీర్ఘచతురస్రాకారంలో కనిపించే సతోడి జలపాతాలు సుమారు 60 అడుగుల పైనుంచి దూకుతూ అటుపై దట్టమైన అటవీప్రాంతంలో ప్రవహించి కొదసలి ఆనకట్టకు చేరుకుంటుంది.మినీ నయాగారగా పిలుచుకునే సతోడి జలపాతంలో సహజమైన ఈతకొలను పర్యాటకులను మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.యల్లాపూర్‌ నుంచి అక్కడక్కడా సూచించిన నామఫలకాల ఆధారంగా ట్రెక్కింగ్‌ ద్వారా జలపాతాలు చేరుకోవచ్చు.లేదా యల్లాపూర్‌ నుంచి ప్రత్యేకమైన వాహనాల్లో జలపాతాల వద్దకు చేరుకొని అక్కడి నుంచి అరకిలోమీటర్‌ ట్రెక్కింగ్‌ చేసి కూడా చేరుకోవచ్చు.రుతువులతో సంబంధం లేకుండా సతోడి జలపాతంలో ఏడాది పొడవునా నీటి ప్రవాహం ఉండడంతో అన్ని కాలాల్లోనూ సతోడి జలపాతం ట్రెక్కింగ్‌కు అనుకూలమే.సతోడి జలపాతాల చుట్టూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలను పరిశీలిస్తే..

సతోడి జలపాతాలు

మాగోడ్‌ జలపాతం..
సతోడి జలపాతం పర్యటనలో మాగోడ్‌ జలపాతం కూడా ప్రముఖమైన పర్యాటక ప్రదేశం.సుమారు 200 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకే బెడ్టి నది రెండు పాయలుగా విడిపోయి మాగోడ్‌ జలపాతంగా ఏర్పడుతుంది.దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో అంత ఎత్తు నుంచి దూకే జలపాతం చూడడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది.వేసవి కాలంలో పొడిగా వర్షాకాలం,శీతాకాలంలో పొగమంచుతో దర్శనమిచ్చే మాగోడ్‌ జలపాతం అన్ని కాలాల్లోనూ కనువిందుగా ఉంటుంది..

మాగోడ్ జలపాతం..

మాగోడ్ జలపాతం..

కాద్రా,కొదసల్లి ఆనకట్టలు..
సుమారు రెండు దశాబ్దాల క్రితం కాళీ నదిపై కర్ణాటక పవర్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్మించిన కొదసల్లి ఆనకట్ట ఉత్తరకన్నడ జిల్లా సాగునీటికి ప్రధాన వనరుగా నిలుస్తోంది.దీంతోపాటు కాద్రా జలాశయం జలవిద్యుత్‌ కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.పడవలు లేదా బోట్లలో కాద్రా కొదసలి బ్యాక్‌ వాటర్‌పై ప్రయాణం మరో అద్వీతయ అనుభూతి కలిగిస్తుంది.నిర్మలమైన నీటిపై దట్టమైన అడవుల మధ్య అటవీ అందాలు, వన్యప్రాణులు, పక్షుల శబ్దాలతో ప్రయాణం అందమైన అనుభవంగా మిగిలిపోతుంది.మరికొంతమంది పర్యాటకులు,ప్రకృతి,వన్యప్రాణుల ప్రేమికులు అడవుల్లో ట్రెక్కింగ్‌ చేస్తూ అటవీ అందాల లోతులు తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు.అంతటి దట్టమైన అడవిలో వెలసిన చిన్న టీ దుకాణంలో టీ తాగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తుంటే అంతకు మించిన స్వర్గం లేదనిపిస్తుంది.ఇక కొదసలి ఆనకట్టకు 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొదసాలి ఆనకట్ట కూడా తప్పకుండా చూడాల్సిన ప్రదేశమే.అయితే కొదసాలి ఆనకట్ట వద్ద జనసంచారం అస్సలు కనిపించని నేపథ్యంలో అధికారుల నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది..

కాద్రా,కొదసల్లి ఆనకట్ట

కాద్రా కొదసలి వెనుక జలాలు..

కాద్రా కొదసలి వెనుక జలాలు..

కవడికేరి ఆలయం..
మాగోడ్‌ జలపాతం నుంచి పది కిలోమీటర్ల దూరంలోనున్న కవడికేరి ఆలయం,సరస్సు ప్రకృతి అందాలకే కాదు కొన్ని వింతలకు కూడా నిలయంగా నిలుస్తోంది.స్థానికంగా ఉన్న కవడియమ్మ లేదా దుర్గాదేవిని స్థానిక గిరిజన ప్రజలకు పరమ పవిత్రంగా కొలుస్తారు.ఈ ఆలయాన్ని శ్రీక్షేత్రం అని కూడా పిలుస్తుంటారు.ఈ సరస్సు ప్రాంతంలో చాలా అరుదుగా కనిపించే బుల్‌బుల్‌,గడ్డికొక్కిరాయి పక్షులు దర్శనమిస్తాయి.ఇక లక్షల సంఖ్యలో విరగబూసిర వైల్డ్‌ ఆర్కిడ్స్‌ పూల మధ్యలో కవడికేరి సరస్సు చూపుతిప్పుకోనివ్వదు..

కవడికేరి ఆలయం..

జెనుకల్లు సన్‌సెట్‌ పాయింట్‌..
జెనుకల్లు గుడ్డ సన్‌సెట్‌ పాయింట్‌’(తేనె రాయి కొండ) సతోడి పర్యటనలో మంత్రముగ్ధుల్ని చేసే మరో ప్రముఖ ప్రదేశం.మాగోడ్‌ జలపాతం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖరాగ్రం నుంచి సూర్యాస్తమయం చూడడం వర్ణించలేని అనుభవం ఇస్తుంది.ట్రెక్కింగ్‌ ద్వారా సన్‌సెట్‌ పాయింట్‌కు చేరుకోవడం ఒక ఎత్తైతే అక్కడి నుంచి సూర్యాస్తమయం చూడడం మరొక ఎత్తు.అయితే శిఖరాగ్రంలో ఎటువంటి దుకాణాలు ఉండవు కనుక మంచినీళ్లు,తేలికపాటి చిరుతిళ్లు తీసుకెళ్లడం ఉత్తమం.

జెనుకల్లు శిఖరాగ్రం..

జెనుకల్లు శిఖరంపై సూర్యాస్తమయం..

 

వీటితో పాటు పన్సోలి వెనుక జలాలు,ఫిషింగ్‌ ఇక్కడ చాలా ప్రసిద్ధి.సతోడి పర్యటనలో ఫోటోగ్రఫీకి ఎక్కువ ప్రాధానత్య ఉంటుంది.ఈ ప్రాంతంలో ఫోటోలు తీసుకోవడం జీవితాంతం మధురానుభూతి కలిగిస్తుంది..

 

  

తాజా సమాచారం

Latest Posts

Featured Videos