ఢిల్లీలో ఆంక్షల కొనసాగింపు

న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సడలించిన లాక్డౌన్ నియమాల అమలుకు ఢిల్లీ ప్రభుత్వం విముఖత చూపింది. ‘రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వ సడలింపులను ఢిల్లీలో అమలు చేయబోమ’ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఇక్కడ తేల్చి చెప్పారు. ప్రస్తుత నిబంధనలు అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతాయని వెల్లడించారు. ‘దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. ఆంక్షలు సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. ఢిల్లీలో వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రానందున దుకాణాలను తెరిచే ప్రసక్తేలేదు. ఏప్రిల్ 27న జరిగే ప్రధాని వీడియో సమావేశంలో సడలింపులపై నిర్ణయం తీసుకుంటామ’ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో కరోనా పాజటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇపట్పి వరకు కేసుల సంఖ్య 2,514కి చేరింది. ఢిల్లీలో 92కు పైగా కరోనా హాట్స్పాట్ జోన్లను ఏర్పాటు చేశారు. గ్రీన్ జోన్ ప్రాంతాల్లో కూడా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ అలర్ట్ ప్రకటించింది.

తాజా సమాచారం