ఆపిల్ సీఈవోకు భారీ జీతం

  • In Money
  • January 9, 2019
  • 167 Views

వాషింగ్టన్: యాపిల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టిమ్‌కుక్‌ 2018లో అందుకున్న మొత్తం వేతనం ఎంతో తెలుసా..? 15.7 మిలియన్‌ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 110కోట్ల పైమాటే. కాగా.. ఇందులో రూ. 84కోట్లు బోనస్‌ రూపంలోనే తీసుకున్నారట. ఈ మేరకు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ ఫైలింగ్‌ సందర్భంగా యాపిల్‌ ఈ వివరాలను పేర్కొంది. గతేడాది టిమ్‌ అందుకున్న వేతనంలో 3 మిలియన్‌ డాలర్లు మూల వేతనం కాగా.. 12 మిలియన్‌ డాలర్ల బోనస్‌, 6,80,000 డాలర్లు ఇతర పరిహారాల కింద చెల్లించినట్లు యాపిల్ తెలిపింది. గతేడాది యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు భారీగా పెరిగినందువల్లే బోనస్‌ కూడా ఎక్కువగా ఇచ్చినట్లు వెల్లడించింది. ‘2018లో 265.6 బిలియన్‌ డాలర్ల మేర విక్రయాలు జరిపాం. కార్యకలాపాల ద్వారా కంపెనీకి 70.9 బిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 16శాతం ఎక్కువ. అందుకే మా ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ల వేతనం, బోనస్‌లను పెంచాం’ అని యాపిల్ ఫైలింగ్స్‌లో పేర్కొంది. 2011లో టిమ్‌కుక్‌ యాపిల్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇంత భారీ వేతనం తీసుకోవడం ఇదే తొలిసారి. 2016లో టిమ్‌కుక్‌ వేతనం 8.7 మిలియన్‌ డాలర్లు కాగా.. గతేడాది 12.8 మిలియన్‌ డాలర్ల జీతం అందుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos