సాయిబాబాకు సుప్రీంకోర్టులో షాక్

సాయిబాబాకు సుప్రీంకోర్టులో షాక్

న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ఆచార్యుడు జీఎన్ సాయిబాబా విడుదలకు సుప్రీం కోర్టు శనివారం అడ్డు చక్రం వేసింది. మావోయిస్టులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనతోపాటు ఐదుగురు నిర్దోషులని బాంబే హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయ స్థానం శనివారం నిలిపేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ చేపట్టింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేదీ ధర్మాసనం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిలుపుదల ఉత్తర్వు జారీ చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం సాయిబాబా ను విచారించడానికి ముందుగా అనుమతి పొందలేదనే కారణాన్ని చూపి, సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడం సమంజసం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. కేసులోని యథార్థాలను పరిశీలించకుండా, కేవలం సాంకేతిక అంశాల ఆధారంగానే హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. యూఏపీఏ చట్టం ప్రకారం అనుమతి పొందకపోవడంపై సాయిబాబా ట్రయల్ కోర్టులో కానీ, ఇతర కోర్టుల్లో కానీ సవాల్ చేయలేదన్నారు. సాయిబాబాను కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయన బెయిలు కోసం చేసిన వినతిని కోర్టు తిరస్కరించిందని చెప్పారు. తదుపరి విచారణ కోసం నోటీసులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. ప్రొఫెసర్ సాయిబాబా తరపున సీనియర్ అడ్వకేట్ బసంత్ వాదనలు వినిపించారు. 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న ప్రొఫెసర్ సాయిబాబాను ఏడేళ్ళ నుంచి జైలులో ఉంచారని తెలిపారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జైలు బయట, ఇంట్లో ఉండటానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రొఫెసర్ సాయిబాబా 2014 నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. గడ్చిరోలి కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. దీనిపై ఆయన 2017లో హైకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం ఆయన నాగపూర్ జైలులో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos