సాగుకు సాయం

సాగుకు సాయం

అమరావతి వృద్ధాప్య, వికలాంగ, ఇతర సామాజిక పింఛన్లను రెట్టింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం… అన్నదాతలకూ ఆర్థిక వరం ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై అధికారుల స్థాయిలో కసరత్తు ఇప్పటికే మొదలైంది. బహుశా… ఈనెల 21న (సోమవారం) జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకంపై చర్చించి, ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం… రైతులు పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సొమ్ముకోసం వెతుక్కునే అవసరంలేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం రైతుకు నేరుగా కొంత ఆర్థికసాయం చేయాలన్న ఉద్దేశంతో ఉంది. తెలంగాణలో ‘రైతు బంధు’ పేరిట పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. దీనికంటే మెరుగ్గా… భూమిని స్వయంగా సాగుచేసుకునే వారితోపాటు, కౌలుకు తీసుకున్న రైతులకూ సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం! వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచే రైతుకు పెట్టుబడి సహాయం చేయాలని దాదాపుగా నిర్ణయించినట్లు తెలిసింది. ఎకరాకు ఎంత మొత్తం ఇవ్వాలి, దీనికి సంబంధించిన విధి విధానాలు, పథకం పేరును ఖరారు చేయాల్సి ఉంది. కేవలం భూ యజమానులకే కాకుండా… కౌలు రైతులకు కూడా మేలు చేసేలా ‘పెట్టుబడి సాయం’ అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. రైతే భూమిని సాగు చేసుకుంటూ ఉంటే నేరుగా ఆయనకే లబ్ధి చేకూరుస్తారు. ఒకవేళ కౌలుకు ఇచ్చి ఉంటే… సహాయాన్ని ఇద్దరి మధ్య పంచితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఇలా చేస్తే ఇద్దరికీ ఊరటగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కౌలు రైతులకూ రుణాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రైతులకు సాయం చేయడంలో ఆదర్శ రాష్ట్రంగా ఉన్నామని… వారిని మరింతగా ఆదుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇన్‌పుట్‌ సబ్సిడీ, విత్తనాలు, ఎరువుల సరఫరా, పశుపోషణకు సాయం, సాగునీరు, కేంద్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా మద్దతు ధరతో పంటల కొనుగోలు, రుణమాఫీ వంటి పథకాలు, చర్యల ద్వారా రైతులకు అండగా ఉంటున్నామని… ఇంకా ఏం చేస్తే బాగుంటుందో పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ క్రమంలోనే రైతుకు పెట్టుబడి సహాయం అందించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. రైతుకు కష్టం ఉండొద్దు!మత్స్య పరిశ్రమ నుంచి పాడి అభివృద్ధి వరకు రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. గోకులం, మినీ గోకులం, గడ్డి పెంపకం, సైలేజ్‌ పంపిణీ, దాణామృతం పంపిణీ తదితర పథకాల ద్వారా రైతుకు అదనపు ఆదాయం వచ్చేలా చేసింది. ‘2005 నుంచి 2014వరకు రాష్ట్రంలో ఏటా వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య వందకులోపే ఉంది. భవిష్యత్తులో అసలు రైతు ఆత్మహ్యతలనేవి లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. ఇందులో భాగంగానే పెట్టుబడి పథకానికి రూపకల్పన చేస్తున్నాం’ అని ఒక అధికారి తెలిపారు.

తాజా సమాచారం