దోషిత్వ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తా

దోషిత్వ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తా

న్యూఢిల్లీ : కోర్టు ధిక్కార దోషి సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనను దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తానని విన్నవించారు. ప్రశాంత్ భూషణ్పై దాఖలైన కోర్టు ధిక్కార కేసుల్లో ఒకదానిలో ఆయన కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు కోర్టు 14న తీర్పు చెప్పింది. శిక్ష ను ఈ నెల 20న ప్రకటించనుంది. ఆయన తరపున న్యాయవాది ట్ డాక్టర్ రాజీవ్ ధవన్ మరొక కోర్టు ధిక్కార కేసులో సోమవారం జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సమక్షంలో హాజరయ్యారు. మాజీ ప్రధాన న్యాయమూర్తులకు అవినీతిలో ప్రమేయం ఉందని ప్రశాంత్ భూషణ్ చేసిన ఆరోపణలపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ సందర్భంగా రాజీవ్ ధవన్ ఈ విన్నపం చేశారు. ప్రశాంత్ భూషణ్ లిఖితపూర్వకంగా సమర్పించిన వినతి పత్రంలో మాజీ భారత ప్రధాన న్యాయమూర్తులపై తాను చేసిన అవినీతి ఆరోపణల ట్వీట్లు ప్రజా ప్రయోజనం కోసం చేసినవని తెలిపారు. ఇవి కోర్టు ధిక్కారం కాబోవన్నారు. ధర్మాసనాన్ని ఉద్దేశించి ధవన్ మాట్లాడుతూ, తన క్లయింటు చేసిన ఆరోపణలు కోర్టు ధిక్కారం అవుతాయా? కాదా? అనే నిర్దిష్ట అంశాన్ని పరిశీ లించడం గురించే విచారణ జరుగుతోందన్నారు. గతంలోని 16 మంది భారత ప్రధాన న్యాయమూర్తుల్లో సగం మంది అవినీతిపరులేనని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత న్యాయ మూర్తులకు వర్తించవని చెప్పారు. అందువల్ల ఇది కోర్టు ధిక్కారం కాబోదని తెలిపారు. 2009 కోర్టు ధిక్కార కేసుపై ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ‘జ్యుడిషియల్ కరప్షన్’పై బహిరంగంగా ప్రకటనలు చేస్తే, పర్యవసానాలు ఏమిటని ప్రశ్నించింది. ఈ అంశంపై కూడా వాదనలు వింటామని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos