తెదేపాకు పట్టినగతే తెరాసకు కూడా..

తెదేపాకు పట్టినగతే తెరాసకు కూడా..

కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌ రేవంత్‌రెడ్డి తెరాస అధినేత కేసీఆర్‌పై,సభాపతిపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కనీసం వాదనలు కూడా వినకుండా 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసినందుకు శాసనసభ సభాపతికి సిగ్గు లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.విలీనం ప్రజాస్వామ్య బద్దంగా జరిగిందంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కేసీఆర్‌కు చట్టాల గురించి ఇసుమంతైనా జ్ఞానం లేదని స్పష్టమవుతోందంటూ విమర్శించారు. చట్టాల గురించి తెలియకపోతే అడ్వకేట్‌ జనరల్‌ను సంప్రదించి చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని విమర్శించారు. విలీనం సభాపతి పరిధిలోకి రాదని అసలు ప్రతిపక్షాన్ని విలీనం చేసే అధికారం సభాపతికి లేదన్నారు. భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ విమర్శించారు.కాంగ్రెస్‌ పార్టీకీ రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలుగా విలీనం కోరుతూ ఎలా కోరారని ప్రశ్నించారు.డబ్బులు,పదవుల కోసం పార్టీలు మారిన ఎమ్మెల్యేలంతా వెధవలంటూ మండిపడ్డారు.స్థానిక సంస్థల్లో కూడా 45 శాతం మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనలేదని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలను ఫిరాయింపులకు ప్రోత్సహించి సాధించిన విజయం కూడా ఒక గొప్ప విజయంగా తెరాస ప్రచారం చేసుకుంటుందంటూ విమర్శించారు.దీంతోపాటు తెలుగుదేశం పార్టీపై కూడా రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ,లోక్‌సభలకు జరిగిన ఎన్నికల్లో తెదేపాకు పట్టిన గతే తెలంగాణలో తెరాసకు పడుతుందని షాకింగ్‌ కమెంట్స్‌ చేశారు.అధికారంలో ఉన్న సమయంలో 23 మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలను ఫిరాయింపులకు ప్రోత్సహించిన తెదేపాకు ఇటీవల ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారని అదేవిధంగా తెలంగాణలో కూడా తెరాసకు అదేగతి పడుతుందని 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించిన తెరాసకు 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగలనున్నారన్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos