కెమెరాలో పిక్సల్స్ కాదు రిజల్యూషన్ ముఖ్యం..

కెమెరాలో పిక్సల్స్ కాదు రిజల్యూషన్ ముఖ్యం..

ప్రస్తుతం చిన్నపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్మొబైళ్లు సర్వసాధారణ విషయమయ్యాయి. అందులోనూ కొద్ది కాలంగా సెల్ఫీలు,టిక్‌టాక్‌ల పిచ్చి మరింత ముదిరాక మొబైళ్లలో అదనపు హంగులు మొదలయ్యాయి.ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కంపెనీలు 18 మెగా పిక్సల్స్, 23 మెగా పిక్సల్స్ అంటూ పెద్ద అక్షరాలతో కంపెనీలు ప్రకటనలు ఇస్తుంటాయి. అన్నేసి మెగా పిక్సల్స్ చూడ్డానికి మంచిగానే కనిపిస్తాయి. అయితే, స్మార్ట్ ఫోన్ కెమెరా లెన్స్ గురించి మాత్రం ప్రకటనల్లో ఎక్కడా కనిపించదు. ఫోన్ కంపెనీలు కెమెరా సెన్సార్లను, కెమెరా లెన్స్ లను విడిగా సమకూర్చుకుని రెండింటినీ ఫోన్లో అమర్చుతుంటాయి. లెన్స్ లతో పోల్చుకుంటే కెమెరా సెన్సార్లు చౌకగా ఉంటాయి. చౌకగా వస్తుండడంతో సాధారణంగా ఎక్కువ ఫోన్లలో అధిక రిజల్యూషన్ తో కూడిన కెమెరా సెన్సార్ ను, ఖరీదు ఎక్కువగా ఉండడంతో తక్కువ రిజల్యూషన్ ఉన్న లెన్స్ ను ఏర్పాటు చేస్తున్నాయి. లెన్స్ రిజల్యూషన్ తక్కువ కావడం వల్ల కెమెరా రిజల్యూషన్ ఎక్కువ ఉన్నప్పటికీ అది పరిమితమవుతోంది. దీంతో వాస్తవంగా చూస్తే ఫొటో రిజల్యూషన్ తక్కువగా వస్తుంది. డిజిటల్ ఫొటోగ్రఫీలో రిజల్యూషన్ చాలా ముఖ్యమైంది. రిజల్యూషన్ కెమెరా సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఫొటో తీసినప్పుడు వస్తువు లేదా మూలకం వివరాలు సుస్పష్టంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఇక ఓ దృశ్యంలో ఎన్ని పిక్సల్స్ ఉన్నాయనేది రిజల్యూషన్ లో పేర్కొంటారు. ఓ ఇమేజ్ ఎత్తు, వెడల్పు ఆధారంగా అది ఎంత రిజల్యూషన్ ను కలిగి ఉందో చెప్పొచ్చు. ఉదాహరణకు ఓ ఇమేజ్ 2048 పిక్సల్స్ వెడల్పు, 1536 పిక్సల్స్ ఎత్తు ఉందనుకుంటే ఈ రెండింటినీ హెచ్చవేస్తే 31,45,728 వస్తుంది. ఇన్ని పిక్సల్స్ ఆ చిత్రంలో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇది 3.1 మెగా పిక్సల్స్ తో సమానం. ఒక మెగా పిక్సల్ అంటే పది లక్షల పిక్సల్స్. ఈ ఫొటోను 2048X1536 అని కూడా చెప్పొచ్చు.మెగా పిక్సల్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ సైజులో చిత్రాన్ని షూట్ చేసుకునే వీలుంటుంది. పీపీఐ (పిక్సల్స్ పర్ ఇంచ్) అన్నది ఒక అంగుళం విస్తీర్ణంలో ఉండే పిక్సల్స్ ను సూచించేది. స్మార్ట్ ఫోన్లలో స్క్రీన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లలో ఇది కనిపిస్తుంది. మెగా పిక్సల్స్ అన్నవి ఓ చిత్రం ఏ పరిమాణంలో ఉన్నదీ తెలియజేస్తుంది. ఒక గదిలో 10 మంది ఉంటే ఏం కాదు. కానీ, ఓ 50 లేదా 100 మంది అదే గదిలోకి వచ్చేస్తే ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తుంది. ఇలాగే కెమెరా సెన్సార్ పై ఎక్కువ మెగా పిక్సల్స్ ను దగ్గర దగ్గరగా ఏర్పాటు చేయడం వల్ల చిత్రం నాణ్యత తగ్గిపోతుంది. చాలా వరకు బడ్జెట్ ఫోన్లలో కెమెరాలతో తీసిన ఫోన్లు బ్లర్ గా ఉండడం అందుకే. అందుకే మెగా పిక్సల్ కౌంట్ చూడకుండా లెన్స్ సెన్సార్ ను చూడాలంటారు నిపుణులు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos