చంద్రగిరిలో రీపోలింగ్‌పై తెదేపా అభ్యంతరం

చంద్రగిరిలో రీపోలింగ్‌పై తెదేపా అభ్యంతరం

ఢిల్లీ : చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై తెదేపా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నాయకులు కంభంపాటి రామ్మోహన్‌రావు, సీఎం. రమేశ్‌, గురువారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలుసుకున్నారు. వైకాపా ఫిర్యాదుపై ఎలాంటి విచారణ చేపట్టకుండానే రీపోలింగ్‌ జరపాలని ఎలా నిర్ణయిస్తారని వారు ప్రశ్నించారు. మరో వైపు చంద్రగిరి నియోజకవర్గంలో మరికొన్ని చోట్ల రీపోలింగ్‌ జరపాలని తెదేపా నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారులను కోరారు. మంత్రి నక్కా ఆనందబాబు సహా పలువురు నాయకులు దీనిపై ఇన్‌ఛార్జి సీఈఓ సుజాత శర్మకు వినతి పత్రాన్ని అందజేశారు. కాగా నియోజకవర్గంలోని ఎన్‌ఆర్‌. కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్త కండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురంలలో ఈ నెల 19న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రీపోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది. గత నెల 11న పోలింగ్‌ సందర్భంగా ఆ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos