సహాయ మంత్రి పదవి వెనుక అమిత్‌షా మాస్టర్‌ప్లాన్‌..

సహాయ మంత్రి పదవి వెనుక అమిత్‌షా మాస్టర్‌ప్లాన్‌..

ప్రధాని నరేంద్రమోదీ,హోంమంత్రి అమిత్‌షా ద్వయం వేసే ఎత్తుగడలకు,పాచిలు పారకపోవడం చాలా తక్కువనే చెప్పాలి.ప్రస్తుతం దేశం మొత్తం బీజేపీపై సానుకూలత నెలకొనడానికి,రెండవసారి సొంత బలంతో అధికారంలోకి రావడంలో మోదీ,అమిత్‌షా ద్వయం పక్కాగా అమలు చేసిన ప్రణాళికలు,వ్యూహాలే అని చెప్పుకోక తప్పదు.బీజేపీని దేశం నలుమూలల బలోపేతం చేయడానికి పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన అమిత్‌షా మొదటగా ఈశాన్య రాష్ట్రాలపై గురి పెట్టారు.ఈ క్రమంలో మొదటిసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కిరణ్ రిజిజుకు అనూహ్యంగా హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. బీజేపీకి పెద్దగా పట్టులేని ప్రాంత నేతకు అంతకీలక శాఖ ఇవ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కానీ.. ఈ అయిదేళ్లలో ఈశాన్యాన బీజేపీ తన జెండా రెపరెపలాడిస్తోంది. అంతేకాదు.. వివాదాస్పద నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ వంటి కార్యక్రమాలు అస్సాంలో ఎంత వ్యతిరేకతను తెచ్చాయో బీజేపీని అస్సాం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో అంతగా బలపడేలా చేశాయి. వీటన్నిటి వెనుక హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు పాత్ర ఎంతో ఉంది.అలా ఐదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని బలపరచడంలో మోది,అమిత్‌షా ద్వయం సఫలీకృతులయ్యారు.ఫలితంగా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కషాయం జెండా రెపరెపలాడింది.ఇక ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తర భారతం,మధ్య భారతంలో బలంగానే ఉన్న బీజేపీ పరిస్థితి దక్షిణాదిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది.ఒక్క కర్ణాటక రాష్ట్ర మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడు,కేరళ రాష్ట్రాల్లో బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదంటూ ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.అయితే అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపి విజయకేతనం ఎగురవేయడంతో దక్షిణాదిపై బీజేపీ అధిష్టానంలో మళ్లీ ఆశలు మొలకెత్తాయి. తెలంగాణలో ఇదే ఊపును కొనసాగించడంతో పాటు కొరకరాని కొయ్యగా మారిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మెల్లిగా పాగా వేయడానికి బీజేపీ చాణక్యుడు అమిత్‌షా ప్రణాళికలు అమలు చేసినట్లు తెలుస్తోంది.అందులో భాగంగానే సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన కిషన్‌రెడ్డికి హోంశాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చారు.తమ భావజాల వ్యాప్తికి అందుకు అడ్డంగా ఉన్న పరిస్థితులను సద్దుమణచడానికి ఈ శాఖ కిషన్ రెడ్డికి తద్వారా బీజేపీకి బాగా ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.కిషన్ రెడ్డి కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా దక్షిణాది మొత్తం ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. శాఖ కేటాయించిన తరువాత తొలిసారి మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి అందుకు తగ్గ సంకేతాలు పంపించారు కూడా. ఉగ్రవాదులకు హైదరాబాద్ సురక్షిత స్థావరంగా మారిందని… నగరంలో వారిని పూర్తిగా కట్టడి చేస్తామని ఆయన అన్నారు. హోంమంత్రి అమిత్ షాతో కలసి పనిచేసే భాగ్యం తనకు లభించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఏపీకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లేనందువల్ల… ఆ రాష్ట్రాన్ని కూడా చూసుకునే బాధ్యతను తనకు అప్పగించారని… ఈ మేరకు హైకమాండ్ తనకు స్పష్టమైన మార్గనిర్దేశం చేసిందని తెలిపారు.కావునా… దక్షిణాది అందులోనూ ప్రత్యేకంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను అన్ని రకాలుగా బీజేపీ పరం చేసే లక్ష్యంతో కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించినట్లు అర్థమవుతోంది. ఇదంతా బీజేపీ అనుకున్నది అనుకున్నట్లుగా వాస్తవ రూపం దాల్చితే తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అనూహ్య నిర్ణాయాలు పరిణామాలు ముందుముందు కనిపించనున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos