అక్టోబర్‌ 5న పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలి.. రామ్‌దేవ్‌ బాబాకు హైకోర్టు ఆదేశం

అక్టోబర్‌ 5న పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలి.. రామ్‌దేవ్‌ బాబాకు హైకోర్టు ఆదేశం

జైపూర్: అక్టోబర్ 5న పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని యోగా గురువు రామ్దేవ్ బాబా ను రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఆయన అరెస్ట్ పై ఇచ్చిన స్టేను అక్టోబర్ 16 వరకు పొడిగించింది. ఫిబ్రవరి 2న రాజస్థాన్లోని బార్మర్లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న రామ్దేవ్ బాబా, ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ పథాయ్ ఖాన్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఫిబ్రవరి 5న చోటాన్ పోలీస్ స్టేషన్లో యోగా గురువుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో విద్వేషాన్ని రెచ్చగొట్టడం, మతపరమైన మనోభావాలను కించపరచడం వంటి అభియోగాల కింద రామ్దేవ్ బాబాపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరడంతోపాటు అరెస్ట్ నుంచి ఊరట ఇవ్వాలని కోరుతూ రామ్దేవ్ బాబా రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం, పోలీసులు ఆయనను అరెస్ట్ చేయకుండా స్టే ఇచ్చింది. అలాగే మే 20 లోపు దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. అయితే పోలీస్ అధికారి ఎదుట ఆయన హాజరుకా లేదు. మరోవైపు రామ్దేవ్ బాబా పిటిషన్పై రాజస్థాన్ హైకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. అక్టోబర్ 5న చోటాన్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని తాజాగా ఆదేశించింది. అలాగే విచారణ అధికారి పిలిచినప్పుడు ఆయన వద్దకు వెళ్లాలని పేర్కొంది. అక్టోబర్ 16న కేసు డైరీని కోర్టులో సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. రామ్దేవ్ బాబా అరెస్టుపై స్టేను అప్పటి వరకు హైకోర్టు పొడిగించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos