ఆఖరి వన్డేకు వరుణ గండం

  • In Sports
  • July 27, 2022
  • 197 Views
ఆఖరి వన్డేకు వరుణ గండం

విండీస్‌తో 3 వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని జోరుమీదున్న టీమిండియాకు వరుణుడు అడ్డుకట్ట వేసేలా ఉన్నాడు. ఇవాళ (జులై 27) ట్రినిడాడ్ వేదికగా జరుగబోయే మూడో వన్డేకు వాన గండం పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి నుంచే మ్యాచ్‌కు వేదిక అయిన పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఆకాశం మేఘావృతమైందని, మ్యాచ్ సమయానికి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలో పేర్కొంది.
దీంతో మ్యాచ్ సాధ్యసాధ్యాలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఒకవేళ మ్యాచ్ మొదలైనా మధ్యమధ్యలో వరుణ ఆటంకాలు తప్పవని, 50 ఓవర్ల ఆట సాధ్యమయ్యే అవకాశాలు చాలా తక్కువని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు తప్పి, 50 ఓవర్ల పాటు సజావుగా సాగాలని టీమిండియా కోరుకుంటోంది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి  రెట్టింపు విశ్వాసంతో ఉన్న ధావన్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి విండీస్‌ను వైట్‌ వాష్‌ చేయాలని భావిస్తోంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌లలో చివరి వరకు పోరాడి ఓడిన విండీస్ సైతం ఈ మ్యాచ్‌ను ఛాలెంజ్‌గా తీసుకోనుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది.
ఇక జట్ల విషయానికొస్తే.. టీమిండియా ఈ మ్యాచ్‌లో రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్‌ సింగ్, రవీంద్ర జడేజా తుది జట్టులోకి రావచ్చు. మరోవైపు విండీస్ రెండో వన్డే జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ తప్పించాల్సి వస్తే గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అకీల్ హొసెన్‌పై వేటు వేసే ఆస్కారం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos