కీలకంగా మారుతున్న ప్రియాంక

కీలకంగా మారుతున్న ప్రియాంక

న్యూఢిల్లీ : కాంగ్రెస్లో ప్రియాంక గాంధీ వాద్రా పాత్ర క్రమక్రమంగా పెరుగుతున్నది. పార్టీలో ఆమె మరింత కీలకంగా మారుతు న్నారు. కొన్నేండ్లుగా తన రాజకీయ కార్యకలాపాలను యూపీ వరకే పరిమితం చేసిన తర్వాత.. చివరకు 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆమె పాత్రను పార్టీలో విస్తరించారు. గత నెల 31న న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్లో జరిగిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మొదటి ర్యాలీలో, ఆమె కూటమి డిమాండ్ల చార్టర్ను చదవటమే కాకుండా మోడీ ప్రభుత్వంపై దాడికి రామాయణాన్ని ప్రయోగించారు. మోడీ, బీజేపీలపై పదునైన విమర్శలను సంధిస్తూ, వారిని ఇరుకున పెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రియాంకపై కాంగ్రెస్ నాయకులు మంచి అంచనాలే పెట్టుకుంటున్నారు. శనివారం జైపూర్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై నిర్వహించిన ర్యాలీకి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఆమె న్యాయపత్ర (మ్యానిఫెస్టో)ను చదవటమే కాకుండా.. మోడీ, బీజేపీపై దాడి చేస్తూ ప్రసంగం చేసింది. పార్టీలో ఆమె పాత్ర మరింతగా పెరిగిందనటానికి ఇదే సంకేతమనీ, ఇక్కడి నుంచి ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ జాతీయ ప్రచారంలో ముఖ్యమైన భాగంగా మారారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ”ఆమె ప్రధాన కార్యదర్శిగా పదవీకాలం చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నది. రెండేండ్ల క్రితం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకుల్లో మనోబలాన్ని నింపారు” అని చెప్తున్నారు. ”నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకున్నది. పదేండ్లుగా మోడీ ప్రభుత్వాన్ని చూశారు. మీరు బీజేపీ సర్కారును చూశారు. నిరుద్యోగాన్ని తొలగించటానికి ఆయన (మోడీ) పెద్ద వాగ్దానాలు చేశాడు. పెద్ద ప్రకటనలు చేశాడు. కానీ అతను ఒక్కటి కూడా నెరవేర్చ లేదు” అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ సమక్షంలో జైపూర్లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రియాంక గాంధీ అన్నారు. మోడీపై విరుచుకు పడిన ఆమె.. తన ప్రసంగంలో మరింత పరిణితిని సాధించారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రియాంక మునుపెన్నడూ లేని విధంగా పార్టీకి మరింత విస్తృతంగా ప్రచారం చేయటానికి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారు. ”ఆమె రాజకీయాల్లోకి వచ్చిన ప్రారంభ సంవత్సరాల్లో, ఆమె కుటుంబ లోక్సభ స్థానాలైన అమేథీ, రారుబరేలీ, యూపీలోని కొన్ని ఇతర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. రాహుల్గాంధీకి తోడ్పాటునందించింది. కొంతకాలం పాటు, ఆమె పార్టీకి ఒక ముఖ్యమైన శక్తి కేంద్రంగా, సంక్షోభ నిర్వాహకు రాలిగా కూడా ఉద్భవించింది” అని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుం టున్నారు. యూపీలో ఐదుసార్లు ఎంపీగా గెలిచిన పప్పు యాదవ్ను కాంగ్రెస్లోకి తీసుకురావటంలో ఆమె పాత్ర కూడా ఉన్నదని ఈ విషయం తెలిసిన నాయకుడొకరు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, సచిన్ పైలట్ వంటి ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు ఆమె ప్రధాన సమూహంలో భాగంగా విస్తృతంగా పరిగణించబడ్డారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హిందూత్వ రాజకీయాలు చేసే బీజేపీకి.. అదేదారిలో వారికి సమాధానాలిస్తూ కఠినమైన ప్రశ్నలను సంధిస్తున్నారనీ, ఇటీవలి సమావేశాలలో ఆమె చేసిన ప్రసంగాలే ఇందుకు నిదర్శనమని వారు చెప్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos