పీఎం కేర్స్‌ నిధులు ఎక్కడ వెళ్తున్నాయి

పీఎం కేర్స్‌ నిధులు ఎక్కడ వెళ్తున్నాయి

కోలకత్తా: దర్యాప్తు సంస్థలతో కేంద్రం తమను భయపెట్టాలని చూస్తోందని పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. అత్యవసర సమయంలో ప్రజల్ని ఆదుకోవడానికి కేటాయించిన పీఎం కేర్స్ నిధులు ఎక్కడ వెళ్తున్నాయని ఆమె ప్రశ్నించారు. ‘పీఎం కేర్స్కు కేటాయించిన లక్షల కోట్ల నగదు ఎక్కడ పోతోంది? ఆ నిధుల గురించి భవిష్యత్తు ఎవరికైనా తెలుసా? కేంద్రం మాకు మాత్రం పాఠాలు చెబుతుంది. కానీ వారు ఎందుకు ఆ నగదుపై ఆడిట్ నిర్వహించడం లేదు. కరోనా వైరస్తో పోరాటం చేయడానికి కేంద్రం మాకు ఏవిధంగా సాయపడిందో చెప్పాలి’ అని నిప్పులు చెరిగారు. కొవిడ్ పరిస్థితులపై సమీక్షించేందుకు ఈనెల 4న కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు. మొదటిసారి లాక్డౌన్ విధించినప్పుడు కూడా ఇదేవిధంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించకపోవటాన్ని తప్పుపట్టారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు ఎంతో బాగున్నాయన్నారు. మమ్మల్ని భయపెట్టడానికి కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని దుయ్యబట్టారు. ఏం చేసినా తాము వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనల విషయంలో భాజపాకు ఏ పార్టీ మద్దతు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రైతుల విషయంలో భాజపా మొండి వైఖరి అవలంబించడం సరికాదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos