గ్రామవాలంటీర్ల నియామకాలకు ఆదిలోనే హంసపాదు..

గ్రామవాలంటీర్ల నియామకాలకు ఆదిలోనే హంసపాదు..

 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేపట్టిన గ్రామవాలంటీర్ల నియామకాలపై కోర్టులో పిటిషన్‌ దాఖలు కావడం చర్చనీయాంశమైంది.పదేళ్ల పాటు యాత్రలు,దీక్షలు,ధర్నాలు చేసిన ఫలితంగా ఈసారి అధికారం దక్కడంతో గతంలో ఎవరూ అందించని విధంగా తన పరిపాలన ఉండాలనే తపనతో సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో అడుగులు వేస్తున్నారు.ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చడానికి శ్రీకారం చుట్టిన వైఎస్‌ జగన్‌ అందులో భాగంగా గ్రామ వాలంటీర్ల నియామకాలకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రెండు నెలల క్రితమే నియామక పనులు చేపట్టిన అధికారులు జులై 11వ తేదీన ఇంటర్‌వ్యూలు చేయడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను లబ్దిదారులకు సక్రమంగా చేరవేయాలనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల నియమకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించేలా చర్యలు తీసుకుంటున్నారు. వాలంటీర్లుగా ఎంపిక అయినవారు తమ పరిధిలోని 50 కుటుంబాలకు వారధిగా ఉండాల్సి వస్తుంది. ఆయా కుటుంబాల నుంచి వచ్చే వినతులు గానీ, సమస్యలు గానీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా పనిచేయాల్సి ఉంటుంది. గ్రామ వాలంటీర్లుగా పనిచేయడానికి చాలామంది నిరుద్యోగులు ముందుకొచ్చారు. ఒక్కొక్కరికి నెలకు ఐదు వేల రూపాయల వేతనం ఇవ్వనుండడంతో చాలామంది పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. ఎంతో ఇంతో నెలకు ఆదాయం వస్తుందని భావించారు. అలా రాష్ట్రవ్యాప్తంగా నెలకు వంద కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం పడనుంది. లెక్కన సంవత్సరానికి 1200 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది .రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మంది వాలంటీర్లు నియమించడానికి నిర్ణయించుకున్న ప్రభుత్వం అందుకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేయగా తొమ్మిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో  దరఖాస్తు ప్రక్రియ ముగిసి వాటి పరిశీలన కూడా పూర్తికావడంతో ఇక మిగిలింది ఇంటర్వ్యూలే. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా కొందరు నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఇంటర్వ్యూల ద్వారా గ్రామ వాలంటీర్ల నియామకాలు చేపట్టడం సరికాదంటూ పిటిషన్ దాఖలు చేశారు. నేటి నుంచి గురువారం (జులై 11 తేదీ) నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం కావాల్సి ఉండగా అంతలోనే కొందరు నిరుద్యోగులు న్యాయస్థానానికి వెళ్లడం చర్చనీయాంశమైంది. జులై 11 నుంచి 20 తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఆగస్టు ఒకటో తేదీన ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించాలనేది షెడ్యూల్. దాని తర్వాత ఆగస్టు 5 నుంచి 10 తేదీ వరకు ట్రైనింగ్ ఇచ్చి 15 తేదీ నుంచి గ్రామ వాలంటీర్లుగా బాధ్యతలు అప్పగించాలని అధికారులు నిర్ణయించుకన్నారు. అయితే ఇంటర్వ్యూ ప్రక్రియను వ్యతిరేకిస్తూ కొందరు బుధవారం నాడు హైకోర్టులో పిటిషన్ వేయడంతో అది గురువారం నాడు విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos