గత పదేళ్ల మోదీ పాలనలో అన్ని రంగాల్లోనూ విధ్వంసమే

గత పదేళ్ల మోదీ పాలనలో అన్ని రంగాల్లోనూ విధ్వంసమే

న్యూ ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ గత పదేళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. అన్ని రంగాల్లోనూ విధ్వంసం జరిగిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రజాస్వామ్యం బలహీనపడిందన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇవాళ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిదంబరం మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ‘గత పదేళ్ల మోదీ పాలనలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు. అన్ని రంగాల్లోనూ విధ్వంసం జరిగింది. మోదీ ప్రభుత్వం ధనవంతుల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కేవలం ధనవంతుల ప్రయోజనాలే లక్ష్యంగా నడుస్తోంది. దేశంలో ఉన్న ఒక్క శాతం ధనికుల కోసమే బీజేపీ పాలన సాగింది. నిరుపేదలను మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వ సంస్థలను పనిచేయనీయకపోవడం, బలహీన వర్గాల అణచివేత కొనసాగుతోంది. పార్లమెంట్ వ్యవస్థను కూడా బలహీనపరిచారు’ అని చిదంబరం ధ్వజమెత్తారు.‘గత పదేళ్లలో దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చేలా మేనిఫెస్టోను సిద్ధం చేశాం. ఉద్యోగాలు, సంపద, సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తాం. గత పదేళ్లలో దేశం 5.9 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. యూపీఏ తొలి విడత పాలనలో దేశం 8.5 శాతం వృద్ధి సాధించింది. 24 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. 2024లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తాం. అధికారం చేపట్టగానే మరో 23 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పిస్తాం’ అని చిదంబరం వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos