పొత్తుకోసం రాయబారం

పొత్తుకోసం రాయబారం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. జనసేన… వామపక్షాలతో వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది.పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు ఇటీవల టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం జనసేనానిని ఆహ్వానించారు. కానీ పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు. మరోవైపు ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని భావించారు. కానీ వారు వేర్వేరుగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం పవన్ కృష్ణా జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేనతో పొత్తు కోసం రాయబారం..
తమతో పొత్తు కోసం కొందరు (కొన్ని పార్టీలు) ప్రయత్నాలు చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేనకు బలం లేదని బయటకు చెబుతూ, మరోవైపు మనతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బలం లేదంటూ రాయబారాలు నడపడం విడ్డూరమన్నారు. ఇదే మన బలానికి నిదర్శనమన్నారు. జనసేన బలంగా ఉండటం వల్లే అనేక మార్గాల ద్వారా నేతలు రాయబారాలు నడుపుతున్నారన్నారు. అంతేకాదు, ఆ నేతలు తెరాస నేతలతోను మాట్లాడిస్తున్నారని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో పొత్తు కోసం రాయబారం నెరపుతున్న ఆ నేతలు ఎవరు, పొత్తు కోసం ప్రయత్నిస్తున్న పార్టీలు ఏమిటి అనే చర్చ సాగుతోంది. టీడీపీకి, టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా పొసగడం లేదు. అదే సమయంలో ఏపీలో కేసీఆర్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలను జగన్ స్వాగతించారు. అంతేకాదు, ఇరుపార్టీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని ప్రచారం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి సహా పలుచోట్ల వైసీపీ.. తెరాసకు మద్దతు పలికిందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెరాస నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ చెప్పడం.. వైసీపీని ఉద్దేశించేనా అనే చర్చ సాగుతోంది. అసలుపవన్ ఏమన్నారంటే చంద్రబాబు వచ్చి జనసేన మాతో రావాలని ఆకాంక్షించినా, లేదంటే తెలంగాణ సీఎం కూర్చొని.. జగన్మోహన్ రెడ్డి, మీరు(జనసేన) కలిసి వెళ్లాలని సూచించినా మన బలాన్ని చెబుతున్నాయని వ్యాఖ్యానించారు.
రాజధాని అంటే రూ.లక్షల కోట్ల వ్యవహారం..
2014లో తాను వ్యూహాత్మకంగానే టీడీపీకి మద్దతిచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. జనసేనకు సీట్లు రావన్న నేతలో మనతో కలిసి రావాలని అనుకుంటున్నారని చెప్పారు. తెరాస నేతలతో మాట్లాడించడమే, మన బలానికి నిదర్శనం అన్నారు. ఇప్పటి ఎమ్మెల్యేలు కేవలం దోచుకోవడం పైనే దృష్టి సారించారని చెప్పారు. రాజధాని అంటే రూ.లక్షల కోట్ల వ్యవహారమని, దానిని సమంగా పంచడం లేదన్నారు. అందుకోసం పోరాటం చేయాలన్నారు..
పార్టీ నిలబడుతుందా అనే అనుమానం వచ్చింది..
ఎక్కువ మందికి సాయం చేయాలంటే రాజకీయాలే మార్గమని అందుకే ఎంచుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజారాజ్యం వైఫల్యం తర్వాత పార్టీ పెట్టి నిలబడగలనా అనే అనుమానం వచ్చిందని చెప్పారు. కొందరు నేతలు దిగజారి మాట్లాడుతున్నారని, తాను అలా దిగజారలేనని చెప్పారు. తాను సినిమాల్లో నటించేటప్పుడు కొంతమందికి సాయం చేశానని చెప్పారు. కానీ రాజకీయాల ద్వారా ఎక్కువమందికి చేయవచ్చన్నారు.

జగన్, కేసీఆర్ మధ్య సంబంధాలు ఉన్నాయా?..
కాగా, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో తెరాసకు అంతర్గతంగా సంబంధాలు ఉన్నట్లుగా కనిపిస్తోందని అర్థమవుతోందని అంటున్నారు. ఇప్పటికే జగన్, తెరాస మధ్య సంబంధాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. మోడీ, జగన్, కేసీఆర్ ఒక్కటేనని చెబుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే చెప్పడం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos