సాగు చట్టాలపై విపక్షాలు గరం

సాగు చట్టాలపై విపక్షాలు గరం

న్యూ ఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో రెండో రోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆర్జేడీ సభ్యుడు మనోజ్ కుమార్ ఝా కేంద్రంపై విరుచుకు పడ్డారు. విమర్శలను కేంద్రం దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు. “చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. రైతుల బాధలను అర్థం చేసుకోండి. కఠినమైన శీతాకాలంలో మీరు నీటి సరఫరాను నిలిపివేశారు. రోడ్లపై కందకాలు తవ్వారు. ముళ్ల తీగలు, మేకులను రహదారికి అడ్డంగా అమర్చారు. నేను దేశ సరిహద్దులోకి వెళ్లాను. ఇలాంటి దూకుడైన విధానాలు భారత్లోకి వచ్చిన పొరుగుదేశాల పట్ల చూపించడం లేద’ని ధుయ్యదయ్యబట్టారు. పాప్స్టార్ రిహానా చేసిన ఒక్క ట్వీట్ వల్ల ప్రజాస్వామ్యం బలహీనంగా మారిపోదన్నారు. భాజపా గత ఎన్నికల్లో 303 స్థానాలు గెలవడానికి కారణం రైతులేనని, కోల్డ్ స్టోరేజీల వ్యవస్థను నియంత్రించే వారి వల్ల కాదని ఎద్దేవా చేశారు. రైతులను ఖలిస్థానీ, నక్సల్స్, పాకిస్థాన్ ఏజెంట్లుగా అభివర్ణించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘విమర్శలను వినే ఓపిక ప్రభుత్వానికి నశించింది. కనీస మద్దతు ధరకు 2006లోనే బిహార్ చరమగీతం పాడింది. ఇప్పుడు రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులే తప్ప రైతులు లేరు. ఇప్పుడు కూలీల సరఫరా స్థితికి దిగజారింది. పంజాబ్, హరియాణాను సైతం ఇదే విధంగా మార్చాలనుకుంటున్నారా’ని నిలదీశారు.‘పెద్ద నోట్ల రద్దు నుంచి.. సీఏఏ వరకు ప్రతి నిర్ణయం ప్రజలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింద’ని కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ ధ్వజ మెత్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలను ప్రస్తావించి పెద్ద నోట్ల రద్దు వ్యవస్థీకృత దోపిడీ అని విమర్శించారు. దీని వల్ల సుమారు 50 లక్షల మంది నిరుద్యోగులుగా మారారని వివరించారు. సాగు చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలని అభివర్ణింంచారు. భారతీయ కిసాన్ సంఘ్ పలు నిబంధనలను వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను విప్లవంగా పరిగణిస్తే.. అది నియంతృత్వమే అవుతుందన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన అల్లర్లను తీవ్రంగా ఖండించారు మాజీ ప్రధాని దేవేగౌడ. అయితే, హింస వెనక సంఘవిద్రోహ శక్తుల ప్రమేయం ఉందని.. అందుకు రైతులు కారణం కాదన్నారు. రైతులను శిక్షించకూడదని కోరారు. నిరసన ప్రాంతాల్లో బారికేడ్లు, మేకులు, ముళ్ల కంచెలు వేయటం వల్ల ప్రయోజనం లేదని సూచించారు. శాంతియుతంగా పరిష్కారం కనుక్కోవాలన్నారు. సాగు చట్టాలపై కాంగ్రెస్ తన వైఖరి మార్చుకుందని జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. 2019 లోక్సభ ఎన్నికల ప్రణాళికలో ఇదే తరహా చట్టాల ప్రస్తావన ఉందన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న శరద్ పవార్ వ్యవసాయంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని రాష్ట్రాలకు లేఖ రాశారని గుర్తు చేశారు. రాజ్యసభ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల వరకు వాయిదా పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos