అటవీశాఖ అధికారులపై మరో దాడి..

అటవీశాఖ అధికారులపై మరో దాడి..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ అటవీప్రాంతంలో మొక్కలు నాటడానికి ప్రయత్నించిన అటవీశాఖ అధికారులపై తెరాస నేతలు దాడికి పాల్పడ్డ ఘటన మరువక ముందే తాజాగా అటవీశాఖ అధికారులపై దాడికి తెగబడ్డ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని ములకలపల్లి మండలం గుండాలపాడులో అటవీప్రాంతంలో పోడుభూములను చదును చేయడానికి అటవీశాఖ అధికారులు ట్రాక్టర్లు,జేసీబీలతో చేరుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు అధికారులను అడ్డుకున్నారు.ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం,తోపులాట చోటు చేసుకుంది.వాగ్వాదం శృతి మించడంతో గిరిజనులు ఒక్కసారిగా కర్రలు,రాళ్లతో అధికారులపై సామూహికంగా దాడులకు తెగబడ్డారు.దీంతో అధికారులు ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకొని ములకపల్లి పోలీసులను ఆశ్రయించారు. గిరిజనుల దాడిలో సెక్షన్‌ అధికారి నీలమయ్య,బీట్‌ అధికారి భాస్కర్‌రావులకు గాయాలయ్యాయి.ములకపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.అటవీశాఖ అధికారులపై మూడు రోజుల వ్యవధిలో రెండు దాడులు జరగడంతో అటవీశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మాకు రక్షణ ఏర్పాట్లు చేయకపోతే అడవుల్లోకి వెళ్లలేం. మాపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అడవుల సంరక్షణ బాధ్యతలు చేపట్టలేం. అడవుల్లో స్థానికంగా రాజకీయ జోక్యం పెరుగుతోంది. పోలీసు, రెవెన్యూ శాఖలు సహకరించడం లేదు. మమ్మల్ని మేము రక్షించుకునేందుకు అధికారులు, సిబ్బంది వద్ద ఆయుధాలు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా రక్షణకు ప్రభుత్వపరంగా స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఇకముందు విధుల నిర్వహణ కష్టమవుతుంది..’అని రాష్ట్ర ప్రభుత్వానికి ఐఎఫ్‌ఎస్‌ స్థాయి మొదలుకుని వివిధ స్థాయిల్లోని అటవీ అధికారులు విజ్ఞప్తి చేశారు.కొమురం భీం,భద్రాద్రి జిల్లాల్లో అటవీశాఖ అధికారుల దాడులు జరిగిన నేపథ్యంలో దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై పీడీయాక్ట్‌ పెట్టాలని, ఈ దాడి వెనక రాజకీయంగా ఎవరున్నారో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ కేసులను త్వరితంగా పరిష్కరించేందుకు వీలుగా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos