యాదాద్రి స్తంబాలపై బొమ్మల తొలగింపు..

యాదాద్రి స్తంబాలపై బొమ్మల తొలగింపు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయం రాతి స్తంబాలపై సీఎం కేసీఆర్తో పాటు తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు,తెరాస పార్టీ గుర్తు తదితర బొమ్మలు చెక్కడంపై వివాదాలు,విమర్శలు చెలరేగడంతో అధికారులు బొమ్మలను తొలగించారు.యాదాద్రి ఆలయంలోని అష్టభుజి ప్రాకారంలో ఉన్న స్తంభాలపై కేసీఆర్, కారు ఇతర చిత్రాలు చెక్కడంపై తెలంగాణలో పెద్ద దుమారం రేగింది. అయితే ఇది శిల్పుల ఇష్టమని.. తాము ఉద్దేశ్యపూర్వకంగా చెక్కించలేదని ఆలయ అభివృద్ధి అధారిటీ స్పష్టం చేసింది.కానీ ప్రస్తుత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేవి శిల్పాలని.. ఈ విషయంలో రాజకీయాల తగదని వివిధ రాజకీయ పక్షాలు విమర్శించాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వ పెద్దలు వెనక్కి తగ్గారు.ఆలయంలోని స్తంభాలపై కేసీఆర్తో పాటు ఎలాంటి రాజకీయ చిత్రాలు ఉండటానికి వీల్లేదని సీఎం ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతకు ముందు యాదాద్రి ఆలయ అభివృద్ధి కమిటీ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, మరికొందరితో భూపాల్ రెడ్డి ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఎవరి ఆదేశం మేరకు ఈ పని చేశారో చెప్పాలని నిలదీశారు. ప్రాంగణంలో తన బొమ్మ ఉండాలని సీఎం కేసీఆర్ కూడా కోరుకోరని స్పష్టం చేశారు. దైవ సంబంధ అంశాలే ఉండాలని సీఎం ఆకాంక్షించారని చెప్పుకొచ్చారు. యాదాద్రి ఆలయంలో దైవ సంబంధిత చిహ్నాలే ఉండాలని ఆదేశించారు. నాయకులు, పార్టీల చిహ్నాలు ఉండటానికి వీల్లేదని హెచ్చరించారు. కేసీఆర్, ఇందిరా గాంధీ విగ్రహాలతోపాటు పార్టీ చిహ్నాలు ఎందుకు చెక్కారంటూ నిలదీశారు. ఆలయ ప్రాంగణంలో తన చిత్రం ఉండాలని కేసీఆర్ కోరుకోలేదని కేవలం దేవాలయ విశిష్టత, దైవ సంబంధిత అంశాలకు మాత్రం శిల్పుల ఇష్టానికే వదిలేసినట్లు భూపాల్రెడ్డి వారికి తెలిపారు.

తాజా సమాచారం