ముగిసిన నామపత్రాల పర్వం

ముగిసిన నామపత్రాల పర్వం

నిక సంగ్రామానికి సోమవారం నుంచి ప్రారంభమైన నామపత్రాల స్వీకరణ బుధవారం పూర్తయింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో మొదటి విడత 23 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాటిల్లో 590 పంచాయతీలు, 5,693 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా క్లస్టర్ల పరిధిలో స్టేజ్‌ వన్‌ అధికారులు నామపత్రాలు స్వీకరించారు. సోమ, మంగళవారాలతో పోల్చితే..

బుధవారం అధిక సంఖ్యలో నామ పత్రాలు దాఖలు అయ్యాయి. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గం.లకు స్వీకరణ గడువు ముగియాలి. నిర్ణీత గడువుకు కేవలం గంట ముందు పదుల సంఖ్యల్లో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేసేందుకు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. వచ్చిన వారందరికీ టోకెన్లు జారీ చేసి.. వరస క్రమంలో స్వీకరించే ఏర్పాట్లు చేశారు. బొమ్మలరామారం, రాజపేట, దేవరకొండ, పీఏపల్లి, అనంతగిరి, పెన్‌పహాడ్‌, చివ్వెంల మండలాల్లో రాత్రి 8 గం. వరకు ఈ తంతు సాగింది. మోతె మండల పరిధిలోని రెండు క్లస్టర్ల పరిధిలో రాత్రి 10 గం. వరకు పరిశీలన సాగింది. ఈ పరిస్థితి ఉమ్మడి జిల్లా పరిధిలోని 15కు పైగా మండలాల్లో కనిపించింది. ఊహించని విధంగా అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన రావడంతో చాలా క్లస్టర్లలో స్టేజ్‌ వన్‌ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గురువారం నుంచి నామపత్రాల పరిశీలన, తిరస్కరణ, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత పోటీ పడే అభ్యర్థుల తుది జాబితాలు ఖరారు చేయనున్నారు.

సూర్యాపేటలో పోటాపోటీ
మొదటి విడతలో సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి పరిధిలో 161 పంచాయతీలు, 1,456 వార్డులున్నాయి. వీటిలో చాలా పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేశారు. అయినా ఇక్కడ పోటీ నెలకొంది. కేవలం మునగాల మండలం మాధవరం పంచాయతీకి మాత్రమే ఒక్కరే నామపత్రాలు దాఖలు చేశారు. నడిగూడెం, చివ్వెంల, కోదాడ మండలాల్లో ఒక్కో పంచాయతీకి 3 నుంచి ఆరు నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం.

నల్గొండలో ఎక్కువగా
ఉమ్మడి జిల్లా పరిధిలో నల్గొండలోనే ఎక్కువగా ఏకగ్రీవాలు నమోదయ్యాయి. పది మండలాల్లో ఎన్నికలు జరుగుతుండగా మర్రిగూడ, చింతపల్లి మండలాలు మినహాయించి మిగిలిన ఎనిమిది మండలాల్లో సర్పంచి పదవులకు ఒక్కటే నామినేషను దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. అందిన సమాచారం మేరకు చందంపేట- కోరుట్ల, నేరేడుగొమ్ము- దాసరపల్లి, డిండి- కల్యాతండా, కొండమల్లేపల్లి-రాణిగాని తండా, చెన్నమనేనిపల్లి, పీఏపల్లి- పుట్టంగండి, గన్నేపల్లి, నాంపల్లి- నర్సింహులగూడెం, తిరుమలగిరి, గుర్రంపోడు- మైలారం, దేవరకొండ-రచ్చ్యాతండా ఆయా చోట్ల సర్పంచి, వార్డు సభ్యులకు ఒక్కటే నామపత్రాలు దాఖలైనట్లు తెలిసింది.

యాదాద్రిలో ‘7’ ఏకగ్రీవం
రాత్రి పొద్దుపోయే వరకు అందిన సమాచారం మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని అయిదు మండలాల్లో ఏడు పంచాయతీలు, వాటి పరిధిలోని వార్డులకు ఒక్క అభ్యర్థి చొప్పునే నామపత్రాలు దాఖలు చేశారు. బొమ్మల రామారం మండలం తూముకుంట, రామస్వామి తండా, ఆలేరు మండలం కందిగడ్డ తండా, రాజపేట మండలం కొండ్రెడ్డి చెరువు, మల్లగూడెం, యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్‌ తండా, తుర్కపల్లి మండలం బాబుల్‌నాయక్‌ తండాలో ఒక్కరు చొప్పునే నామపత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ, ఉప సంహరణ ప్రక్రియలు పూర్తయితే మరిన్ని పంచాయతీలు అదేబాటలో నడిచే వీలుంది. ఇందుకనుగుణంగా అధికార, ప్రతిపక్ష పార్టీ మండల పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos