దారిద్య్రంపై పోరాటానికి నోబెల్ పురస్కారం

దారిద్య్రంపై పోరాటానికి నోబెల్ పురస్కారం

పేదరికం మానవాళికి శాపం కాకూడదనే లక్ష్యంతో, దాన్ని సూక్ష్మస్థాయిలో ఎదుర్కోవడంపై ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఆ ముగ్గురే.. మైఖెల్ క్రెమెర్, అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డఫ్లో. అర్థ శాస్త్రంలో వీరు చేసిన పరిశోధనలు గొప్ప సత్ఫలితాలనివ్వడంతో వీరికి ఈ ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. ప్రపంచ మానవాళికి శాపంగా మారుతున్న పేదరికంపై పోరాటాన్ని వీరు కెన్యాలో ప్రారంభించారు. తొమ్మిదో దశకంలో మైఖెల్ క్రెమెర్ తన ఇద్దరు సహచరులైన అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డఫ్లోలతో కలిసి కెన్యాలో క్షేత్ర స్థాయిలో తమ ఆర్థిక నమూనాను అమలు చేశారు. ఇవి గొప్ప సత్ఫలితాలనిచ్చాయి. పేదరికంతో బాధపడుతున్నప్పటికీ కొన్ని సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయని చెప్పారు. పిల్లల ఆరోగ్యం, విద్య, తదితర మౌలికాంశాలను అభివృద్ధి చేసుకుంటే వారి కుటుంబాల్లో వెలుగులు ప్రసరిస్తాయి. కెన్యాలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న కొన్ని కుటుంబాల్లో వీటిపై అవగాహన కల్పించారు. దీంతో ఆ కుటుంబాల్లో అనూహ్య మార్పులు వచ్చాయి. దీంతో ఈ నమూనాను మరికొన్ని ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ అభిజిత్ బెనర్జీ నేతృత్వంలో ఈ ఆర్థిక నమూనా అమలు చేశారు. దీనివల్ల దాదాపు 50 లక్షల మంది చిన్నారులు బడి బాటపట్టారు. దీంతో పాటు పేదరికంలో మగ్గుతున్న వర్గాలకు సబ్సిడీలు ఇప్పించడం, ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టడంతో వారి జీవితాల్లో కొంత మెరుగుదల కనిపించింది. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తే కొన్ని కోట్లాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడగలరని క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి.

తాజా సమాచారం