ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి

ఇమ్రాన్ కు  నోబెల్ శాంతి బహుమతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ శనివారం ఆ దేశ పార్లమెంట్‌ ది సెక్రటేరియట్‌ ఆఫ్‌ నేషనల్‌ అసెంబ్లీ (దిగువసభ)లో పాక్‌ సమాచార శాఖ మంత్రి ఫవాద్‌ చౌద్రీ  తీర్మానాన్ని  ప్రవేశపెట్టారు. ‘‘ఇమ్రాన్‌ ఉద్రిక్త  పరిస్థితుల మధ్య బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ఆయన నోబెల్‌ శాంతి బహుమతికి అర్హుడు’’ అని ఈ తీర్మానంలో  పేర్కొన్నారు. సోమవారం తీర్మానంపై  చర్చించనున్నారు.  భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన కృషికి గుర్తింపుగా ఈ బహుమతి ఇవ్వాలని కోరారు. భారత్‌ వాయు సేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను విడుదల చేయడం ద్వారా రెండు  దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించారని  తీర్మానంలో పేర్కొన్నారు. ఇమ్రాన్‌ పార్టీకి మెజార్టీ ఉండటంతో తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్షాల స్పందన  ఆసక్తికరంగా మారింది.  తమ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను శాంతిని కోరుకునే వ్యక్తని కొనియాడుతూ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్థానీలు డిమాండు చేస్తున్నారు. ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారు.  రెండు లక్షల సంతకాలతో ఆన్‌లైన్‌ పిటిషన్‌ను దాఖలు చేయడంతో పాటు, ‘నోబెల్‌పీస్‌ప్రైజ్‌ఫర్ఇమ్రాన్‌ఖాన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు. అభినందన్‌ను విడుదల చేయడం వల్ల రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఇమ్రాన్‌ ముగింపు పలికారని చాలామంది పాకిస్థానీలు భావిస్తున్నారు. నోబెల్ బహుమతికి ఆయన అర్హుడని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ డిమాండ్‌పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అదంతా భ్రమని, పాక్‌ ఆర్థికంగా, పరిపాలన పరంగా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారతీయులు కూడా ఈ డిమాండ్‌ను కొట్టిపారేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos