70 శాతం ఒమిక్రాన్‌ కేసులే…

70 శాతం ఒమిక్రాన్‌ కేసులే…

హైదరాబాద్ : తెలంగాణలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కూడా థర్డ్ వేవ్ మొదలైందంటూ పేర్కొన్నారు. దీనిలో భాగంగానే నిన్న ఒక్కరోజే లక్షకు చేరువలో కేసులు నమోదు అయ్యాయంటూ పేర్కొన్నారు. దేశంలోని 15 రాష్టాల్లో థర్డ్ వేవ్ మొదలైనట్లు పేర్కొన్నారు. తెలంగాణలో 1600 కేసులు నిన్న నమోదయ్యాయని.. జీహెచ్ఎంసీ, మేడ్చల్, రంగారెడ్డిల్లో కేసుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. దేశంలో 2 నుంచి 6 రేట్లు కేసులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో బెడ్ల కొరత లేదన్నారు.
కోవిడ్ బారిన పడిన వాళ్లు దాదాపు ఐదు రోజుల్లోనే కోలుకుంటున్నారని తెలిపారు. కరోనా లక్షణాలుంటే.. వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జనవరి 1 నుంచే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. ఐదు రోజులుగా 4 రెట్లకుపైగా కేసులు వస్తున్నాయన్నారు. పాజిటివిటీ రేటు 3 శాతానికిపైగా ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని తెలిపారు. అయితే.. ఒమిక్రాన్ కేసుల వివరాలు ఇకపై రోజు వారి హెల్త్ బులిటెన్‌లో ఇవ్వబోమంటూ స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ వైరస్ ప్రజా సమూహంలోకి వెళ్లిందని.. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం ఒమిక్రాన్ బాధితులే ఉంటారని పేర్కొన్నారు. అందరికీ జీనోమ్ సీక్వెన్స్ చేయడం సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే యోచన లేదని, పేదల బతుకుదెరువు ముఖ్యమంటూ స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఫిబ్రవరి చివర్లో కేసుల సంఖ్య తగ్గే అవకాశముందని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos