పెట్రోలు ధరలు పెంచుతారు…ధాన్యం ధరలు పెంచరు

న్యూఢిల్లీ: ఇంధన ధరలు పెంచుతున్న కేంద్రానికి ధాన్యం రేట్లు పెంచాలనే ఆలోచన రావడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాకేష్ టికాయత్ మండిపడ్డారు. కేంద్రం కావాలనే వ్యవసాయాన్ని నాశనం చేస్తోందని, దీనిని తాము ఎంతమాత్రమూ సహించబోమని ఆయన అన్నారు. హర్యానాలోని పునియాలో గురువారం నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘పంటలు కోతకు వచ్చాయని, రైతులు వెనక్కి వెళ్తారనే అపోహ నుంచి కేంద్రం బయటికి రావాలి. వాళ్లు మొండిగా ఉన్నంత కాలం మేం ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. అవసరమైతే మా పంటను తగలబెడతాం కానీ ఇక్కడి నుంచి కదలం. రెండు నెలల్లో నిరసన ముగుస్తుందనే అపోహలు కూడా మానుకుంటే మంచిది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచే కేంద్రం ధాన్యానికి ఎందుకు ధర పెంచదు? కేంద్రం పరిస్థితిని ఇంకా జఠిలం చేయాలని చూస్తే బెంగాల్‌కు  ట్రాక్టర్లు తీసుకుని వస్తాం. బెంగాల్‌లో కూడా రైతులకు మద్దతు ధర లభించడం లేదు’’ అని టికాయత్ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos