నిజాం సొమ్ము భారత్‌కే…

నిజాం సొమ్ము భారత్‌కే…

లండన్ : అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ నిజాంకు చెందిన ఏడు దశాబ్దాల నాటి కేసులో భారత్‌పై ఓడిపోయింది. డెబ్భై ఏళ్ల కిందట నిజాం బ్రిటన్‌కు తరలించిన ఒక మిలియన్ పౌండ్ల సొమ్ము (ఇప్పటి విలువ 35 మిలియన్ పౌండ్లు) భారత్‌కే దక్కుతుందని హైకోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ బుధవారం తీర్పు చెప్పింది. ఈ సంపదపై పాకిస్థాన్‌కు ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పింది. నిజాం సంపదపై తమకే అధికారం ఉందని 70 ఏళ్లుగా పాకిస్థాన్ వాదిస్తోందని ఈ సందర్భంగా న్యాయమూర్తి గుర్తు చేశారు. 1948లో ఏడో నిజాం పేరుపై లండన్‌లోని బ్యాంకులో ఒక మిలియన్ పౌండ్ల సొమ్ము జమ అయింది. ఈ చరిత్రాత్మకమైన కేసు 70 ఏళ్లుగా ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తోంది. ఓ వైపు భారత్‌తో పాటు నిజాం వారసులైన ముఖర్రమ్ ఝా, ముప్ఫఖమ్ ఝాలు ఈ సంపదపై పోరాడుతుండగా, మరోవైపు పాకిస్థాన్ ఆ ఆస్తి తమకే చెందుతుందని వాదించింది. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవక ముందు నిజాంకు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేశామని, అందుకు చెల్లింపుగా ఈ సొమ్ము తమకే చెందుతుందని పాకిస్థాన్ వాదిస్తూ వస్తోంది. అయితే 1948లో ఏడో నిజాం ఒక మిలియన్ పౌండ్ల సొమ్మును సురక్షితంగా ఉంచడానికే బ్రిటన్‌లోని అప్పటి పాకిస్థాన్ రాయబారి హబీబ్ ఇబ్రహీమ్ రహీంతుల్లాకు పంపారు. ఆ సొమ్మును తనపై ఉన్న విశ్వాసంతో మాత్రమే నిజాం పంపారని రహీంతుల్లా ఓ సందర్భంలో అంగీకరించారు. మరోవైపు హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య జరిగిన సమయంలో భయపడిన నిజాం తాను ఆ సొమ్మును పంపలేదని, తన పేరుపై మరెవరో పంపారని అన్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఆ సొమ్ము లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ బ్యాంకులో ఉంది. దాని విలువ ఇప్పుడు సుమారు రూ.306 కోట్లు. ఈ కేసులో నిజాం వారసులకు భారత ప్రభుత్వం చేయూతనివ్వడంతో కేసు నెగ్గుకురాగలిగారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos