ప్రధానిగా ఖర్గే అభ్యర్థిత్వంపై అసంతృప్తి లేదు

ప్రధానిగా ఖర్గే అభ్యర్థిత్వంపై  అసంతృప్తి లేదు

పాట్నా: ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును కొందరు నేతలు ఇటీవల ప్రతిపాదించడంపై కూటమిలో చీలక ఏర్పడవచ్చనే ఊహాగానాలను బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ తెరదించే ప్రయత్నం చేశారు. కూటమిలో పోస్ట్ కోసం తాను ఎలాంటి ఆసక్తి వ్యక్తం చేయలేదని, తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. కూటమి ఏ నిర్ణయం తీసుకున్నా కూటమిలోనే తాను ఉంటానని వివరణ ఇచ్చారు.ఇండియా కూటమి నాలుగో సమావేశం గత వారంలో న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో కొందరు నేతలు మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రధాన మంత్రి అభ్యర్థిత్వానికి ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రతిపాదనను ఖర్గే వెంటనే తోసిపుచ్చారు. ఎన్నికల్లో సమైక్యంగా పోరాడి గెలవడమే ఇప్పుడు కూటమి ముందున్న ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జేడీయూ నేతలు కొందరు బహిరంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖర్గే ఎవరో ఎవరికీ తెలియదని, కూటమి ఏర్పాటుకు, నేతల మధ్య సయోధ్యకు పాటుపడిన నితీష్ కుమార్ దేశమంతటికీ తెలుసునని, ఆయననే ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయాలని కొందరు వ్యాఖ్యానించారు. నితీష్ అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరగడంతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. కాగా, త్వరలోనే 2024 లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంకాలకు సంబంధించిన చర్చలు జరపాలని ఇండియా బ్లాక్ సమావేశం నిర్ణయం తీసుకుంది. దీనికి డిసెంబర్ 31వ తేదీని తాజా గడువుగా నిర్ణయించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఇండియా కూటమి బహిరంగ సభలు కూడా నిర్వహించనుంది. ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్పై ప్రధానంగా దృష్టి పెట్టాలని కూడా సమావేశం నిర్ణయించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos