‘హార్స్-ట్రేడింగ్ పై జీఎస్టీ ’

‘హార్స్-ట్రేడింగ్ పై జీఎస్టీ ’

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోరు జారారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలను బుధవారం విలేఖరులకు వెల్లడించినపుడు హార్స్-రేసింగ్పై జీఎస్టీ’ అన డానికి బదులు ‘హార్స్-ట్రేడింగ్ పై జీఎస్టీ’ అని తప్పుగా చదివారు. చట్ట సభ్యుల బేరసారాలకు ప్రయోగించే ‘హార్స్-ట్రేడింగ్’ పదం ఆమె నోట రావడం విపక్షాలకు వ్యంగ్యా స్త్రంగా మారింది. మహా రాజకీయ సంక్షోభం నుంచి రాజకీయ లబ్ధి పొందుతున్న బీజేపీ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. నిర్మల్ సీతారామన్ నోరు జారిన వీడియో క్లిప్ని షేర్ చేసి మరీ వ్యంగ్యంగా విమర్శలు కురిపిస్తున్నారు. ఏఐసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్ పవన్ ఖేరా ట్విటర్లో ‘‘ నాకు తెలుసు సీతారామన్ గారూ.. సంప్ర దాయేతర ఆలోచనలు చేయగల సామర్థ్యం మీకుంది . చట్ట సభ్యుల కొనుగోలుపై జీఎస్టీ ఉండాలండీ ’’ అని ఎద్దేవా చేశారు. సీపీఐ-ఎం నేత సీతారాం ఏచూరీ కూడా ట్విటర్లో హార్స్ ట్రేడింగ్పై జీఎస్టీనా.. అయితే ముందుకెళ్లండి మరీ’’ అని ఎగతాళి చేసారు. ‘ పొరపాటున చెప్పినా.. సీతారామన్ నిజాయితీగానే చెప్పారు’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యా నించారు. ‘ఎంతశాతం జీఎస్టీ విధిస్తారో కూడా చెప్పొచ్చు కదా.. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 35 శాతం వీటిలో ఏది?’ అని మరో వ్యక్తి సందేహం వెలిబుచ్చాడు. ‘హార్స్-ట్రేడింగ్ గేమ్’ని బీజేపీయే ఆరంభించిందని ఒకరు.. ఓరి దేవుడో ఇప్పుడు అమిత్ షా జీఎస్టీ కడతారా ఏంటి అని మరో నెటిజన్ స్పందించారు. సంబంధిత వ్యాపారులతో చర్చలు జరిపినా క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, లాటరీలపై 28 శాతం జీఎస్టీ విధింపు నిర్ణయాన్ని ప్రస్తుతం వాయిదా వేసినట్లు సీతారామన్ విలేఖరుల సమావేశంలో చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos