వాట్స్ యాప్ చాట్ తో దొరికిపోయిన పుల్వామా ఉగ్రవాదులు..

వాట్స్ యాప్ చాట్ తో దొరికిపోయిన పుల్వామా ఉగ్రవాదులు..

పుల్వామా ఉగ్రదాడి దుర్ఘటన పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ మంగళవారం జమ్మూ స్పెషల్ కోర్టులో 13500 పేజీల భారీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సహా 19 మందికి ఈ ఉగ్రదాడితో సంబంధం ఉందని ఎన్ ఐ ఏ వెల్లడించింది. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ-శ్రీనగర్ హైవేపే ఈ ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. అదిల్ అహ్మద్ దార్ అనే జైషే ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నింపిన మారుతీ ఈకో కారుతో సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపైకి దూసుకెళ్లాడు. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోగా… మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. జైషే చీఫ్ మసూద్ అజహర్ ఆయన కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉగ్ర కుట్రకు పాల్పడ్డారనే విషయాన్ని ఎన్ ఐ ఏ ఛార్జిషీట్ లో పొందుపరిచింది.మార్చి నెలలో పుల్వామా తరహాలోనే మరో భారీ ఉగ్రదాడికి జైషే మహ్మద్ కుట్ర పన్నగా.. భారత బలగాలను దాన్ని భగ్నం చేశాయి. పుల్వామా దాడిలో ఆత్మాహుతికి పాల్పడిన అదిల్ అహ్మద్తోపాటు.. సూసైడ్ మిషన్ కోసం కశ్మీర్లోని కాకపొరా ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల షకీర్ బషీర్ మాగ్రేను కూడా జైషే సిద్ధంగా ఉంచినట్లు ఎన్ ఐ ఏ వెల్లడించింది. ఫర్నీచర్ షాపు యజమాని అయిన మాగ్రేను రెండో ఆత్మాహుతి దాడి కోసం జైషే ఉగ్రవాది ఖారీ యాసిర్ సన్నద్ధం చేశాడు. పుల్వామా దాడికి కుట్ర పన్నిన వ్యక్తుల్లో మాగ్రే కూడా కీలకమైన వ్యక్తిగా ఎన్ ఐ ఏ గుర్తించింది. ఫిబ్రవరి 14న ఉగ్రదాడికి కారణమైన వాహనాన్ని నడిపిన మాగ్రే.. దాడి జరిగిన ప్రాంతానికి అర కిలోమీటర్ దూరంలో వాహనం దిగిపోయాడు అని తెలిపింది.గతేడాది మార్చి 29న పుల్వామా ఉగ్రదాడి ప్రధాన నిందితుడు ఉమర్ ఫరూక్తోపాటు ఐఈడీ బాంబులను తయారు చేసే కమ్రాన్ ఎన్కౌంటర్లో హతమయ్యారు. మసూద్ అజహర్ సమీప బంధువు 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఇబ్రహీం అజహర్ కుమారుడే ఫరూక్. ఉమర్ ఫరూక్ ఎన్కౌంటర్ తర్వాత జమ్మూ కశ్మీర్ పోలీసులకు అనేక వస్తువులు లభ్యమయ్యాయి. రూ.70 వేల విలువైన సామ్సంగ్ ఎస్-9 గెలాక్సీ ఫోన్ కూడా పోలీసులకు దొరికింది. ఈ కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించిన తర్వాత.. జమ్మూ కశ్మీర్ పోలీసులు ఈ ఫోన్ ను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంకు పంపించారు. ఫోన్ను డీకోడ్ చేయగా… వీడియోలు ఫొటోలను ఉమర్ వాట్సాప్ ద్వారా.. తన బంధువు మౌలానా మహ్మద్ అమర్కు పంపాడనిఆ తర్వాత వాటిని డిలీట్ చేశాడని గుర్తించారు. ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలను కశ్మీర్లోకి అక్రమంగా తీసుకొచ్చారని కూడా గుర్తించారు. ఈ మొబైల్ ఫోన్లో లభ్యమైన వివరాల ఆధారంగా పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ పుల్వామా ఉగ్రదాడికి కుట్ర పన్ని విషయమై బలమైన సాక్ష్యాధారాలను ఎన్ ఐ ఏ సేకరించింది. ఉమర్ ఫరూక్ తో రిలేషన్ షిప్ లో ఉన్న 22 ఏళ్ల ఇన్షా జాన్ అనే యువతి కూడా పుల్వామా ఉగ్ర కుటలో పాలు పంచుకుందని ఎన్ ఐ ఏ స్పష్టం చేసింది. తుపాకీ పట్టుకొని నవ్వుతూ ఉమర్ తో ఫొటోను ఎన్ఐ ఏ గుర్తించింది.మొత్తం 20 కిలోల ఆర్డీఎక్స్ ను వీరు పాకిస్థాన్ నుంచి సాంబా మీదుగా జమ్మూకు చేర్చారని, బాంబులను చేర్చింది ఉమర్ ఫరూఖ్ అని, ఇతన్ని ఈ సంవత్సరం మార్చిలో భద్రతా దళాలు హతమార్చాయని చార్జ్ షీట్ లో వెల్లడించింది. ఇతర పేలుడు పదార్థాలయిన అమోనియం నైట్రేట్ ను ఓ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ద్వారా వీరు కొన్నారని తెలిపింది. ఉగ్రవాదులు వాట్స్ యాప్ ద్వారా చాటింగ్ చేసుకున్నారని, ఆ వివరాలు, బాంబుల ఫోటోలు, వాటిని తరలించిన మార్గం తదితర వివరాలన్నింటినీ సేకరించామని తెలిపింది.తొలిసారిగా పుల్వామా దాడికి వినియోగించిన ఆర్డీఎక్స్ బాంబు, దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల చిత్రాలను కూడా ఎన్ఐఏ తన చార్జ్ షీట్ లో పొందుపరిచింది. ఈ దాడిలో విజయవంతమైతే, వారు మరో దాడి చేయాలని ముందే ప్లాన్ చేశారని తెలిపింది. వీరంతా పాక్ దేశానికి చెందిన వారేనని చెప్పడానికి సాంకేతిక ఆధారాలు ఉన్నాయని, వారు తీసుకుని వచ్చిన వస్తువులు, వారు మాట్లాడుకున్న వీడియో,ఆడియో రికార్డులు సాక్ష్యమని ఎన్ఐఏ తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos