పాతాళ స్వర్గానికి ప్రవేశ ద్వారం నేత్రాణి ద్వీపం..

  • In Tourism
  • December 11, 2019
  • 318 Views
పాతాళ స్వర్గానికి ప్రవేశ ద్వారం నేత్రాణి ద్వీపం..

దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక రాష్ట్రానికి పర్యాటకంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.కేరళ తరువాత అత్యధికంగా పర్యాటక,ఆధ్యాత్మిక ప్రాంతాలు కలిగి ఉన్న రాష్ట్రం కర్ణాటక రాష్ట్రమే.ముఖ్యంగా మలెనాడుగా,కరావళిగా పిలుచుకునే దట్టమైన అడవులతో నిత్యకళ్యాణం పచ్చతోరణంగా దర్శనమిచ్చే పశ్చిమ కనుమల్లో ఉండే చిక్కమగళూరు, శివమొగ్గ,కూర్గ్‌,దక్షిణకన్నడ తదితర పదికి పైగా జిల్లాల్లో లెక్కలేనన్ని ఆధ్యాత్మిక,పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో దక్షిణకన్నడ జిల్లాలోని అరేబియా సముద్ర తీరంలో ఉన్న నేత్రాణి ద్వీపం కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది.

పలు రకాల చేపలు..

సముద్రం మధ్యలో ప్రశాంతమైన దట్టమైన అటవీప్రాంతంలో నీలాకాశాన్ని తలపించే సముద్ర జలాల్లో స్కూబా డైవింగ్‌ నేత్రాణి ద్వీపానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.తక్కువ ఖర్చుతో స్కూబా డైవింగ్‌ చేస్తూ అరుదైన సముద్ర ప్రాణులు,జలచరాలను తిలకించాలంటే నేత్రాణి ద్వీపానికి వెళ్లాల్సిందే.ఆకాశం నుంచి హృదయాకారంలో(హార్ట్‌) కనిపించే నేత్రాణి ద్వీపం ఆద్యంతం వెండి ఇసుకతో కూడిన పశ్చిమ తీర్థయాత్ర పట్టణంగా,పశ్చిమ కనుమలు నేపథ్యంగా అలరారుతోంది.హిందువులు పరమ పవిత్రంగా భావించే మురుడేశ్వర్‌ క్షేత్రం నుంచి కేవలం 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేత్రాణి ద్వీపాన్ని స్థానికంగా నేట్రాగుడో అని పిలుస్తారు.మురుడేశ్వర్‌ సముద్ర తీరం నుంచి సుమారు రెండు గంటల పాటు సముద్ర జలాలపై పడవపై ప్రయాణిస్తూ నేత్రాణి ద్వీపానికి చేరుకోవడం ఒక ఎత్తయితే ద్వీపంలో సముద్రం అడుగున స్కూబా డైవింగ్‌ చేస్తూ సముద్ర అందాలు,సముద్ర ప్రాణుల విన్యాసాలు చూడడం మరోక ఎత్తు.

స్కూబా డైవింగ్‌లో యువతి ఆనందం..

కోరల్‌,బటర్‌ఫ్లై,ట్రిగ్గర్‌,ప్యారట్‌,ఈల్‌ తదితర పలు రకాల చేపలతో పాటు నెపోలియన్ వ్రాస్సే, కోబియా, స్టోన్ ఫిష్, బ్లాక్ టిప్ షార్క్స్, గ్రేట్ బార్రాకుడా, తాబేళ్లు మరియు స్టింగ్రే,సముద్ర పాములు మొదలైన జలచరాలను తిలకించవచ్చు.ఇక నేత్రాణి ద్వీపంలో చేపలు,సముద్ర పాములను ఆహారంగా తీసుకుంటూ జీవించే ఫిష్ ఈగల్స్‌(గద్దల్లో ఒక జాతి)ని కూడా చూడొచ్చు. అంతేకాదండోయ్‌ ద్వీపం చుట్టూ ప్రమాదకరమైన తిమింగలాలు(వేల్‌ షార్క్స్‌)కూడా సంచరిస్తుంటాయి.

నేత్రాణిలో స్కూబా డైవింగ్..

ద్వీపంలో రాక్‌ క్లైంబింగ్‌ చేసే సమయంలో,బోటులో ప్రయాణించే సమయంలో పర్యాటకులు చాలా అప్రమత్తంగా ఉండాలి.అంతేకాదు ద్వీపం రాళ్లు చాలా సూదిగా ఉండడంతో,ప్రమాదకరంగా ఉంటాయి కనుక రాళ్లతో కూడిన గుట్టలు ఎక్కే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.నేత్రాణి ద్వీపంలోనే భారత ప్రభుత్వం సాయుధ బలగాలకు శిక్షణ కూడా ఇస్తుంటుంది.దీంతో ద్వీపంలో ప్రయాణించే సమయంలో అక్కడక్కడా బాంబులు,తూటాల ఖాళీ షెల్లులు కూడా కనిపిస్తుంటాయి.

నేత్రాణిలో స్కూబా డైవింగ్..

ఇక ద్వీపంలోని 16 మీటర్ల (52 అడుగుల) ఎత్తున్నఒక శిలను భారత నావికాదళం బాంబు దాడులకు లక్ష్యంగా చేసుకొని వాయుసేన సైనికులకు శిక్షణ ఇస్తుండేది.దీంతో ఈ ప్రాంతం వాతావరణ సమతౌల్యం,జీవసమతౌల్యం దెబ్బ తింటుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో 2012 లో కర్ణాటక హైకోర్టు దీనిపై స్టే విధించింది.

నేత్రాణిలో స్కూబా డైవింగ్..

ఈ నేపథ్యంలో నేత్రాణి ద్వీపానికి వెళ్లే ముందు పర్యాటకులు తప్పనిసరిగా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.అయితే పర్యాటకులకు ఇవేమి అడ్డంకి కాకుండా పర్యాటకశాఖ తగిన ఏర్పాట్లు తీసుకుంది.ఇక నేత్రాణి ద్వీప పర్యటనకు డిశంబర్‌,జనవరి నెలలు అత్యంత అనుకూలం కాగా జూన్‌,జులై నెలల్లో ఇక్కడ పర్యాటకం కొంత ప్రమాదకరం..

నేత్రాణిలో గుహ..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos