హిందూ దేవాలయాలంటే మీకు లెక్కలేదా?

హిందూ దేవాలయాలంటే మీకు లెక్కలేదా?

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో ఆరు దశాబ్దాల నాటి రథం మంటల్లో చిక్కుకుని కాలిబూడిదవడం పట్ల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ ఆలయం ఎంతో పురాతనమైనదని, క్రీస్తు పూర్వం 300 ఏళ్ల నాటిదని, రథం 63 ఏళ్ల కింద నిర్మితమైనదని తెలిపారు. ఎంతో ప్రసిద్ధి చెందిన రథం కాలిపోవడం దురదృష్టకరమని, అయితే రథం ఒకేసారి కింది నుంచి పైవరకు కాలిపోయిన విధానం చూస్తుంటే విద్రోహ చర్యలానే అనిపిస్తోందని అన్నారు.గతంలో కొన్నిచోట్ల ఇలాగే జరిగితే, ఎవరో పిచ్చివాళ్లు చేశారంటూ కేసులు మూసేశారని, ఇప్పుడు కూడా పిచ్చివాడు చేసిన పిచ్చిచేష్టలా భావించి కేసును క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుందని అభిప్రాయపడ్డారు. చూడబోతే ఇది ఒక మతంపై జరిగిన దాడిలా అనిపిస్తోందని, సీఎం జగన్, మంత్రి వెల్లంపల్లి వంటివారు దయచేసి స్టేట్ మెంట్లు ఇవ్వడంతో సరిపెట్టకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది చిన్న చర్య అని, పిచ్చివాడు చేసిన చర్య అని తీసుకోకుండా, డీజీపీతో మాట్లాడి నిందితుడు ఏ కులస్తుడైనా, ఏ మతస్తుడైనా కఠినచర్యలు తీసుకోవాలని అన్నారు.అంతర్వేది ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారంటూ సీఎం జగన్ ను, వైసీపీ సర్కారును ప్రశ్నించారు. రథాన్ని ఎవరు తగులబెట్టారో తేల్చాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు వైసీపీ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.”రెండు దేవాలయాలకు కలిపి ఒకే ఈవోను నియమిస్తారా? హిందూ దేవాలయాలంటే మీకు లెక్కలేదా? మీకు హిందూ పురాణాలు తెలియవు… అసలు మీ పాలసీ ఏంటి? ఒక మతం మీద దాడి జరుగుతుంటే ఏంచేస్తున్నారు? మీ విధానం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నా. అంతర్వేదిలో సీసీ కెమెరాలు పనిచేయడంలేదని తెలిసింది. చర్యలు తీసుకోవాలని చెప్పిన వాళ్లు మీ మంత్రులకు పిచ్చివాళ్లలా కనిపిస్తున్నారు. రథం ఘటనపై దేవాదాయ శాఖ అధికారులను విచారణ చేయమని చెప్పడమేంటి?” అంటూ ధ్వజమెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos