ప్రచారానికి ప్రజాధనం ఆరు నెలల్లో రూ.38 కోట్లు

ప్రచారానికి ప్రజాధనం ఆరు నెలల్లో రూ.38 కోట్లు

న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఎన్నికల ప్రచారాల కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తున్నది. మోడీని ప్రమోట్ చేసే గూగుల్ యాడ్స్పై ఆరు నెలల్లో రూ.38 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ నెల మార్చి 16 వరకు ఈ మొత్తాన్ని వెచ్చించింది. ఇందులో అత్యధికంగా ఒక్క ఫిబ్రరి నెలలోనే 260 ప్రకటనలపై రూ.14.06 కోట్లకు పైగా ఖర్చు చేయటం గమనార్హం. దీంతో కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడీకి ‘కుటుంబం లేదు’ అని ఈనెల 4న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత బీజేపీ నేతలు సోషల్ మీడియాలో ‘మోడీ కా పరివార్’ అని తమ పేర్లకు చేర్చుకున్నారు. 2019లో ‘చౌకీదార్’ సందర్భాన్ని ఇది గుర్తు చేసింది. ఒక వారం తర్వాత, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ (సీబీసీ) (ఇది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ విభాగం) ”మోడీ కా పరివార్” గూగుల్ ప్రకటనల కోసం కనీసం రూ. 65 లక్షలు వెచ్చించింది. గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరేన్సీ సెంటర్ డేటా దీనిని వెల్లడించింది. ఈ మొత్తం యూట్యూబ్ వంటి అనేక గూగుల్ ప్లాట్ఫారమ్లలో మార్చి 9 నుంచి 14 మధ్య కనీసం 2.75 కోట్ల సార్లు ప్రదర్శించబడిన రెండు వీడియో ప్రకటనల వైపునకు వెళ్లింది. ఒకటి 30 సెకన్ల నిడివి గల వీడియో. ఇందులో ఆర్మీ అధికారులు మోడీ ”కుటుంబం” అని వివరిస్తారు. ఇంకో వీడియోలో, ఒక నిమిషం నిడివితో, మహిళలు మోడీ కుటుంబమని చెప్తారు. మార్చి 1 నుంచి మార్చి 16 మధ్య, మోడీ, ఆయన విజయాలను ప్రచారం చేసే మూడు ఇతర ప్రచారాలైన ”మోదీ కి గ్యారెంటీ”, ”మా మజ్బూత్తో భారత్ మాతా మజ్బూత్”, ”హమారా సంకల్ప్ వికసిత్ భారత్”లపై సీబీసీ 379 గూగుల్ ప్రకటనల కోసం రూ. 10 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అంటే, సగటున రోజుకు రూ. 63 లక్షల వరకు అన్నమాట. మార్చి 17 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) అమల్లోకి వచ్చిన విషయం విదితమే. ఇందులో, వీడియో యాడ్ల కోసం రూ.8.84 కోట్లు ఖర్చు చేయగా, ఇమేజ్ ఫార్మాట్లో యాడ్స్ కోసం రూ.1.12 కోట్లు వెచ్చించారు. చంద్రయాన్-3 ”మహాక్విజ్” కోసం ప్రకటనను ప్రమోట్ చేయటానికి ఖర్చు చేసినప్పుడు.. అంటే గతేడాది సెప్టెంబర్ నుంచి సీబీసీకి గూగుల్ ప్రకటనలపై డేటా అందుబాటులో ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గూగుల్ యాడ్స్ కోసం ఆ శాఖ రూ.38 కోట్లకు పైగా ఖర్చు చేయటం గమనార్హం.ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేసింది. మోడీ కి గ్యారెంటీపై రూ. 11.68 లక్షలు, మా మజ్బూత్ భారత్ మాతా మజ్బూత్పై రూ. 77.8 లక్షలు, హమారా సంకల్ప్ వికసిత్ భారత్పై రూ. 61 లక్షలు ఉన్నాయి.
యూపీలో ప్రకటలనపై అత్యధికంగా రూ.6 కోట్లు
అదే సమయంలో, నవంబర్, డిసెంబర్, జనవరిలో అన్ని గూగుల్ ప్రకటనల మొత్తం రూ. 12.8 కోట్లు ‘మోడీ కి గ్యారెంటీ’ ప్రకటన వైపు వెళ్లాయి. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే యూపీ (రూ. 6 కోట్లు), ఆ తర్వాత మహారాష్ట్ర (రూ. 3.8 కోట్లు), గుజరాత్ (రూ. 3.2 కోట్లు), ఢిల్లీ (రూ. 2.8 కోట్లు), బీహార్ (రూ. 2.3 కోట్లు)లో ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని ప్రకటనల కోసం మోడీ సర్కారు అత్యధిక డబ్బు ఖర్చు చేసింది.
కోడ్ జాన్తా నై
– పూణే రైల్వే స్టేషన్లో ప్రధాని మోడీ పోస్టర్లు
ప్రభుత్వ పథకాల ద్వారా ప్రచారాలను నిషేధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎంసీసీ) అమలులోకి వచ్చిన 48 గంటల తర్వాత కూడా పూణే రైల్వే స్టేషన్లో ప్రధాని మోడీ చిత్రపటాన్ని తొలగించలేదు. ఈ నెల 16న భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ఎన్నికల తేదీలను ప్రకటించటంతో ఎంసీసీ అమలులోకి వచ్చిన విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసిన ఫ్లెక్స్ బ్యానర్లు, పోస్టర్లను తొలగించాలని ఎంసీసీ నిర్దేశించిన 48 గంటల్లోగా వాటిని తొలగించకపోవటం గమనార్హం. పూణే స్టేషన్లోని పోస్టర్లలో గత సంవత్సరం జరిగిన జీ20 ఈవెంట్లో ఒకటి, మరొకటి మోడీ చిత్రంతో పాటు ”సబ్కా సాథ్ సబ్కా వికాస్” అనే నినాదంతో ఉన్నాయి. దీంతో కోడ్ అమల్లోకి వచ్చినా మోడీ చిత్రాలను తొలగించకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా సమాచారం