దాడి చేసి వారిపైనే ఎదురు కేసులా..

దాడి చేసి వారిపైనే ఎదురు కేసులా..

 ప్రభుత్వం ఆదేశాల మేరకు మొక్కలు నాటడానికి ప్రయత్నించిన అటవీశాఖ అధికారులపై తెలంగాణలోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో తెరాస నేతలు దాడులకు పాల్పడ్డ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.దాడిలో అటవీశాఖ మహిళ అధికారి అనితకు తీవ్రగాయాలు కావడంతో ఘటనను ప్రభుత్వంతో పాటు పోలీసులు, అటవీశాఖ అధికారులు కూడా తీవ్రంగా పరిగణించారు.పర్యావరణ కోర్టుకు సహాయకుడిగా వ్యవహరించే సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు అనిత కేసును ఇటీవల సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.దీంతో దాడి ఘటనపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇది శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యేనని పేర్కొన్న ధర్మాసనం కేసును తామే స్వయంగా పర్యవేక్షిస్తామని తెలిపింది. అటవీ అధికారుల మీద దాడి చేసి తిరిగి ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి అధికారులకు రక్షణ లేకుండా చేస్తే అటవీ చట్టాలు నీరుగారిపోతాయని చేసిన అప్పెల్ ను సుప్రీం ధర్మాసనం పేర్కొంది.శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం విషయాన్ని విచారిస్తుందని, పిటిషన్ దాఖలు చేయాలని న్యాయవాది ఎడిఎన్ రావును కోరింది. అనితపై విచారణ జరుగుతున్న అట్రాసిటీ కేసు దర్యాప్తుపై కూడా స్టే విధించింది. దాడి సమయంలో పోలీసుల వద్ద ఏకే-47 తుపాకులు ఉన్నప్పటికీ దాడిని ఆపలేకపోయారని కేసు విషయంలో సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమం కింద అటవీకరణ ప్రాజెక్టు పనులు చేపడుతున్న సమయంలో దాడి జరిగిందని కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ తన బలగంతో అనుచరులతో వెళ్లి అనితపై దాడి చేశారని వివరించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన అనితకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం తిరిగి అట్రాసిటీ కేసులు పెట్టించి దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. అటవీ అధికారులను కోర్టులు రక్షించకుంటే ఉల్లంఘనలు పెరుగుతాయని రావు వాదించారు. దాడులకు సంబంధించిన మీడియా కథనాలను తన పిటిషన్కు జతచేశారు.దీంతో కేసు తామే విచారిస్తామని చెప్పిన సుప్రీం ధర్మాసనం అనిత కేసు గురించి పూర్తి విచారణ చేపట్టనుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos