రవి శాస్త్రిని ఈత కొలనులో తోసేశాం

రవి శాస్త్రిని ఈత కొలనులో తోసేశాం

ఢిల్లీ: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ బుధవారం ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఓసారి ఇండియా టూర్కు వచ్చిన పాకిస్థాన్ క్రికెటర్లు భారత ఆటగాళ్లతో కలిసి హోలీ ఆడినట్లు వెల్లడించాడు. ఓ యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ ఓ పాత జ్ఞాపకాన్ని నెమరేసుకున్నాడు. ‘బెంగళూరులో టెస్టు సందర్భంగా మేము, భారత ఆటగాళ్లు ఒకే హోటల్లో ఉన్నాం. సాయంత్రాలు మేమంతా కలిసి ఒకే దగ్గర సమయం గడిపేవాళ్లం. అది హోలీ సీజన్ కావడంతో హోటల్లోని వారంతా హోలీ ఆడేవారు. నాకు ఇంకా గుర్తుంది. మేమంతా కలిసి ఇమ్రాన్ఖాన్ రూంలోకి వెళ్లి రంగులు చల్లుకున్నాం. భారత క్రికెటర్లను కూడా మేము వదల్లేదు. వారు కూడా మాకు ఎలాంటి అడ్డు చెప్పలేదు’ అని పేర్కొన్నాడు. మియాందాద్ మరికొన్ని విషయాలు పంచుకుంటూ ‘రవిశాస్త్రి ఓ రూంలో దాక్కొన్న విషయాన్ని గుర్తించి మేమంతా అతడ్ని మోసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో తోసేశాం. ఆ టూర్ను చాలా బాగా ఎంజాయ్ చేశాం. పాకిస్థాన్ క్రికెటర్లకి అది ఎప్పటికీ బెస్ట్ టూర్గా మిగిలిపోతుంది. ప్రతి ఒక్కరూ ఇతర మతాల పండగల్లో పాలు పంచుకోవాలి. హోలీ పండగను మేమంతా కలిసి చేసుకున్నాం. ఒకరి పండగల్లో మరొకరు పాలుపంచుకోవడంలో తప్పులేదు’ అని ఆ వీడియోలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos