నెలాఖరుకు హైటెక్‌ సిటీకి మెట్రో!

నెలాఖరుకు హైటెక్‌ సిటీకి మెట్రో!

హైదరాబాద్‌: అమీర్‌పేట-హైటెక్‌సిటీ మార్గంలో ఈ నెలాఖరు నుంచి మెట్రోరైలు పరుగుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రయోగాత్మక పరుగు (ట్రయల్‌ రన్‌) కొలిక్కి రావడంతో భద్రతాపరమైన తనిఖీలు చేపట్టాల్సి ఉంది. ఈ తనిఖీలు నిర్వహించాలని కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్‌)ని నిర్మాణ సంస్థ కోరినట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రారంభించిన మెట్రో మార్గాలతో పోలిస్తే హైటెక్‌ సిటీ మార్గం క్లిష్టమైనది కావడంతో … మరింత క్షుణ్నంగా సీఎంఆర్‌ఎస్‌ తనిఖీలు చేయనున్నారు. అనంతరం ఆయన సూచించిన ప్రకారం భద్రత చర్యలను పటిష్ఠం చేశాక అనుమతి మంజూరు చేస్తారు. ఈలోపు రాష్ట్రంలో మంత్రివర్గం కొలువుదీరితే.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ అనుమతితో ప్రారంభ తేదీ నిర్ణయించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
నెలన్నర రోజులుగా… ఈ మార్గంలో ట్రయల్‌ రన్‌ నవంబరు 29 నుంచి దాదాపుగా నెలన్నర రోజులుగా రాత్రిపూట నిర్వహిస్తున్నారు. చివరి స్టేషన్‌ హైటెక్‌ సిటీలో రివర్సల్‌ లేకపోవడంతో ట్విన్‌ సింగిల్‌ విధానంలో నడుపుతున్నారు. ఇప్పటికే నిర్దేశిత గంటలు ట్రయల్‌ రన్‌ నిర్వహించినా.. ప్రారంభోత్సవం వరకు నిరంతరం జరుగుతూనే ఉంటాయి.
జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టు వరకు..
సాధారణంగా మెట్రో రైళ్లు ఒక ట్రాక్‌లో వెళితే.. మరో ట్రాక్‌లో తిరుగు పయనం అవుతాయి. అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మార్గంలో ప్రస్తుతానికి ఇది సాధ్యపడదు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు స్టేషన్‌ సమీపంలో రివర్సల్‌ ఉండటంతో ఇక్కడి వరకు ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత నాలుగు స్టేషన్లు పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గం చెరువు, హైటెక్‌ సిటీ వరకు మాత్రం ట్విన్‌ సింగిల్‌ లైన్‌లోనే మెట్రోలు వెళతాయి. అంటే వెళ్లిన లైన్‌లోనే తిరిగి చెక్‌పోస్టు వరకు వెనక్కి మళ్లుతాయి. నాలుగు స్టేషన్లే కాబట్టి మెట్రో వేళల్లోనూ పెద్ద జాప్యమేమి ఉండదని అధికారులు అంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos