అమ్మకు పెళ్లి…తనయునికి ప్రశంసలు

అమ్మకు పెళ్లి…తనయునికి ప్రశంసలు

తిరువనంతపురం : తన కోసం ఎన్నో బాధలు భరించిన అమ్మకు అతను మళ్లీ పెళ్లి చేశాడు. ఆ పెళ్లి ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఇప్పుడు నెటిజన్లు అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన గోకుల్‌ శ్రీధర్‌ ఇంజనీర్‌. మంగళవారం ఫేస్‌బుక్‌లో అతనో పోస్టు చేశాడు. రెండో పెళ్లి చేసుకున్న తన తల్లికి హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ అంటూ రెండో భర్తతో ఉన్న తల్లి ఫొటోను పోస్టు చేశాడు. రెండో వివాహాన్ని నేరంగా భావించే ఈ రోజుల్లో ఈ పోస్టు పెట్టడానికి ముందు ఎంతగానో ఆలోచించానని పేర్కొన్నాడు. ఇదే పోస్టులో గత అనుభవాన్ని కూడా నెమరువేసుకున్నాడు. తన తండ్రి ఓ రోజు అమ్మను కొట్టాడు. అమ్మ తల నుంచి రక్తం కారడం గమనించి, ఎలా భరిస్తున్నావమ్మా అని అడిగా. నీ కోసమే కన్నా అంటూ ఆమె బదులివ్వడంతో పాటు ఇంకా ఎంతైనా భరిస్తా అని చెప్పింది. తర్వాత అమ్మతో కలసి ఇంట్లో నుంచి వచ్చేశా. ఆ రోజే అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలనుకున్నా. నా కోసం జీవితాన్ని ధారపోసింది. ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదంటూ…హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ అంటూ ముగించాడు. శ్రీధర్‌ పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే ఇది వైరల్‌గా మారింది. 31 వేలకు పైగా లైకులు, మూడు వేలకు పైగా షేర్లు సంపాదించింది. శ్రీధర్‌ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos