ఏనుగు దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

హోసూరు : ఇక్కడికి సమీపంలో  ఏనుగు దాడి చేసిన సంఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హోసూరు సమీపంలోని సూలగిరి ప్రాంతంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు శుక్రవారం ఉదయం నల్లగాన కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరు ఆస్పత్రికి పంపారు. డెంకణీకోట ప్రాంతంలో  ముగ్గురిని పొట్టన పెట్టుకున్న ఏనుగు ఉదంతం మరువకముందే సూలగిరి ప్రాంతంలో మరో రైతుపై ఏనుగు దాడి చేసిన సంఘటన ఆ ప్రాంతంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే హోసూరు ప్రాంతంలో ఏనుగులు విచ్చలవిడిగా సంచరిస్తూ రైతులపై దాడి చేస్తున్నాయని అటవీ ప్రాంత గ్రామాలకు చెందిన ప్రజలు వాపోతున్నారు. గత రెండు నెలలుగా సూలగిరి ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నా అటవీశాఖ అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో తరటూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాలలో విచ్చలవిడిగా తిరుగుతున్నఏనుగులను దట్టమైన అటవీ ప్రదేశానికి తరిమివేసేందుకు చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణగిరి జిల్లా  డెంకణీకోట సమీపంలో ఏనుగు దాడిలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం 50 మంది సిబ్బంది ఏనుగును మత్తు మందు ద్వారా బంధించి సత్యమంగలం అటవీ ప్రాంతానికి తరలించారు. ఆ ఏనుగు పీడ విరగడైందని సంతోషిస్తున్న తరుణంలో తాజాగా జరిగిన సంఘటన ఆందోళన కలిగిస్తోంది.  

తాజా సమాచారం

Latest Posts

Featured Videos