నిరుద్యోగానికి వ్యతిరేకంగా.. పకోడీలు వేస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేల నిరసన

నిరుద్యోగానికి వ్యతిరేకంగా.. పకోడీలు వేస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేల నిరసన

ముంబై: నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. అసెంబ్లీ బయట పకోడీలు వేస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉద్యోగాల కోసం ప్రకటనలు జారీ చేస్తున్నప్పటికీ ఖాళీలను భర్తీ చేయడంలేదని విమర్శించారు. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన (యుబీటీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్తో కూడిన మహా వికాస్ అఘాడి శాసనసభ్యులు శుక్రవారం విధాన భవన్ వద్ద నిరసన చేపట్టారు. నిరుద్యోగం, పరీక్షా పేపర్ లీక్ సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు అంబాదాస్ దాన్వే, ఎమ్మెల్యేలు సతేజ్ పాటిల్, సచిన్ అహిర్ తదితరులు ఈ సందర్భంగా పకోడీలు వేస్తూ నిరసన తెలిపారు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో యువత పకోడీలు అమ్ముకుని జీవిస్తున్నారని అన్నారు. నిరుద్యోగం, పరీక్ష పేపర్ లీకేజీలు ప్రధాని మోదీ హామీలని దాన్వే ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్య వల్ల మహారాష్ట్రలో ప్రతి రోజు ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లోక్సభకు అందజేపిన జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ద్వారా తెలుస్తున్నదని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ సమస్యపై తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos