డైరెక్టర్ కట్ చెప్పినా తల కొట్టుకుంటూనే ఉన్నా..

  • In Film
  • October 12, 2019
  • 127 Views
డైరెక్టర్ కట్ చెప్పినా తల కొట్టుకుంటూనే ఉన్నా..

గత ఏడాది సంచలన విజయం సాధించిన కీర్తి సురేశ్ నటించిన మహానటి చిత్రంలో ఓ సన్నివేశంలో తెలుగు సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందు నీపేరే తలుచుకుంటారని సావిత్రిని ఉద్దేశిస్తూ కేవి రెడ్డి చెప్పినట్లు డైలాగ్ ఉంటుంది.ఆ మాట కేవీరెడ్డి నిజంగా అన్నారో లేదో తెలియదు కానీ సినిమాలో చెప్పిన డైలాగుకు సావిత్రి అర్హురాలని సావిత్రి నటన చూస్తే అర్థమవుతుంది.పాత్రలో తాను ఎంత లీనమైన నటిస్తానే విషయాన్ని సావిత్రి స్వయంగా చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే.. ‘దేవదాసు’ చిత్రంలో పార్వతి,ముందు దృశ్యాల్లో తప్పితే తర్వాత సంతోషమే ఎరగదు. పోను పోను దుఖమే ఎక్కువ. అటువంటి దృశ్యాల్లో ఒక చోట నేను, నాగేశ్వరరావు గారు నటిస్తూంటే , నేను తలుపు కేసి తలబాదుకుంటూంటాను. దుఖం పట్టలేక ఆ ఘట్టంలో నన్ను నేను మరిచిపోయాను. డైరక్టర్ గారు కట్ చెప్పినా, నేను అలాగే తల కొట్టుకుంటూనే ఉన్నాను. అలాంటి ఎమోషనల్ దృశ్యాల్లో నటించేటప్పుడు, అలా జరుగుతూంటుంది. అదే షాటు ముందు తెలుగులో తీసి, తర్వాత తమిళంలో తీశారు. అప్పుడు కూడా అలాగే జరిగింది. తర్వాత నాగేశ్వరరావు గారు, దర్శకులు రాఘవయ్య గారు నన్ను ఒక చోట కూర్చోబెట్టి విశ్రాంతి తీసుకోమన్నారు. చాలా సేపటి దాకా నేను మామూలు మనిషిని కాలేకపోయాను.అలాగే మిగతా చిత్రాల్లో కూడా శోక ఘట్టాల్లో నటించవలిసి వచ్చినప్పుడు , ఏడవ వలసి వచ్చినప్పుడు , దృశ్యం అయిపోయిన తర్వాత కూడా ఏడుపు ఆగదు. ఎమోషనల్ దృశ్యాల్లో నటించిన తర్వాత , బాగా బలహీనత కలగటం, నరాలు వణకటం, వంటివి నాకు జరుగుతూంటాయి. అందుకుని నేను అలాగే ఇంటికి వెళ్లిపోయి, మేకప్ అయినా తీయకుండా , భోజనమైనా చేయకుండా మంచం మీద పడి నిద్రపోతాను. నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్లి అలా పడుకుంటే , ఎవరూ నన్ను లేపరు. నేను శోక దృశ్యంలో నటించినట్లు వాళ్లకు అర్దమైపోతుంది.నాకు తెలిసినంతవరకూ అంజలిదేవిగారు కూడా..దుఖం నటించేటప్పుడు నాలాగే బాధ పడతారు. ఒక్కోసారి దృశ్యం కాగానే ఆవిడ, మూర్చపోవటం జరుగుతూ ఉంటుంది. స్త్రీలకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది. పురుషులకు ఎందుకు జరగదోనని ఆలోచిస్తూ ఉంటాను. బహుశా స్త్రీలు సున్నిత హృదయులు కాబట్టి ,తట్టుకోలేరేమో అంటూ అప్పట్లో సావిత్రి చెప్పుకొచ్చారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos