రవిప్రకాష్, శివాజీలపై లుకవుట్ నోటీసులు జారీ..

సమాజానికి నీతులు వల్లించే టీవీ9 మాజీ సీఈఓ గోతులు తీసే రకమని కొద్ది రోజుల క్రితం ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిన విషయం విదితమే.నిధుల మళ్లింపు,లోగోల అక్రమ విక్రయం,సంతకాల ఫోర్జరీ కేసులకు సంబంధించి పోలీసుల విచారణకు హాజరు కాకుండా టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌,సినీనటుడు శివాజీలో అజ్ఞాతంలో గడుపుతున్న విషయం కూడా తెలిసిందే.కోర్టులో కూడా బెయిల్‌ పిటిషన్‌ తిరస్కారానికి గురి కావడంతో అరెస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి రవిప్రకాశ్‌,శివాజీలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కొంతమంది కీలకనేతల ఆశ్రయంలో ఉన్నట్లు తెలుస్తోంది.మూడుసార్లు నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరుకాకుండా వ్యక్తిగత కారణాలు,అనారోగ్యం కారణాలుగా చూపి పది రోజులు గడువు కావాలంటూ ఈమెయిల్స్‌ పంపించడంతో ఒళ్లు మండిన పోలీసులు రవిప్రకాశ్‌,సినీ నటుడు శివాజీల కోసం లుక్ ఔట్ సర్య్కులర్ జారీ చేశారు.సీఈవో రవిప్రకాశ్,నటుడు శివాజీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరంచేశారు. గత రెండు రోజులుగా కొన్ని బృందాలు రవిప్రకాశ్ ఆచూకీ కోసం గాలిస్తున్నాయని, శుక్రవారం నుంచి మరో రెండు బృందాలు రంగంలోకి దిగాయని సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు అంటున్నారు. అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్‌రావు ఫిర్యాదుమేరకు ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సైబరాబాద్ పోలీసులు పలు నోటీసులు పంపినా రవిప్రకాష్ పోలీసుల ముందుకు రావడం లేదు. ఏపీలోని కీలక రాజకీయనేతల అండతో ఆయన అక్కడే ఆశ్రయం పొందారనే అనుమానంతో ఆ దిశగా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారని సమాచారం. ఈ కేసులో కీలకం రవిప్రకాశ్ కాబట్టి తొలుత రవిప్రకాశ్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, మరోవైపు తగిన ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు అంటున్నారు. కేసులో మరో నిందితుడు శివాజీకి సైతం సీఆర్పీసీ 41 కింద నోటీసులు జారీచేసే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ మధ్య షేర్ల కొనుగోలు ఒప్పందం నకిలీదని నిరూపించే కొన్ని ఆధారాలను సేకరించిన సైబర్‌క్రైం పోలీసులు మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం శోధిస్తున్నారు. కేసుకు సంబంధించిన పలు కీలకఫైళ్లు, ఇతర లావాదేవీల సమాచారం అంతా పలు డివైజ్‌లలో ఉండటంతో వాటిని వెలికితీసే పనిలో ఉన్నారు. బంజారాహిల్స్‌లోని టీవీ9 కార్యాలయం, రవిప్రకాశ్‌తోపాటు, శివాజీ, ఎంకేవీఎన్ మూర్తి ఇండ్లల్లో నిర్వహించిన సోదాల్లో పలు డాక్యుమెంట్లను సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ప్రధానంగా టీవీ9 కార్యాలయం నుంచి 12 హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు వాటిల్లోంచి ఏ సమాచారాన్ని డిలిట్‌చేశారు. అందులోని సమాచారాన్ని ఇంకెవరికి పంపారన్న కోణంలో సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నట్టు తెలిసింది. టీవీ9 కొనుగోలు డీల్ నిలిపివేయాలంటూ నటుడు శివాజీ దాఖలుచేసిన పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం మరో కేసులో సైతం ఆయనకు భంగపాటు తప్పలేదు. టీవీ9 పాత యాజమాన్యానికి, సైఫ్‌మారిషస్ ఫైనాన్స్ కంపెనీకి మధ్య వాటాల కొనుగోలు వ్యవహారంపై నడుస్తున్న కేసులో తనను కూడా ఇంప్లీడ్‌చేయాలని శివాజీ గతంలో దాఖలుచేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. తాను కూడా టీవీ9లో భాగస్వామినేనని శివాజీ ఎలాంటి ఆధారాలు చూపించకుండా కోర్టును తప్పుదోవ పట్టించాడంటూ ఇంప్లీడ్ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా, టీవీ9 పాత యాజమాన్యం, సైఫ్‌మారిషస్ ఫైనాన్స్ కంపెనీకి మధ్య షేర్ల కొనుగోలుకు సంబంధించి తొలుత ఓ ఒప్పందం కుదిరింది. సైఫ్‌మారిషస్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించేందుకు టీవీ9 పాత యాజమాన్యం అంగీకరించినట్టు తెలిసింది. సైఫ్‌మారిషస్ ఫైనాన్స్ కంపెనీ, టీవీ9 పాత యాజమాన్యానికి సంబంధించిన కేసులో తుది తీర్పును ఈ నెల 24న వెలువరిస్తామని ఎన్సీఎల్టీ ప్రకటించింది.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos