కడప జిల్లా వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ జగన్

కడప జిల్లా వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ జగన్

కడప: మీ క్యాండెట్‌ సుధీర్‌రెడ్డే.. ఎమ్మెల్యే టికెట్‌ ఒకరికే ఇస్తాం. అబద్దం చెప్పలేను. మోసం చేయలేను. నామీద ఏమాత్రం అభిమానం, నమ్మకం ఉన్నా కలిసి పనిచేసి సుధీర్‌రెడ్డికి సపోర్టు చేయండి.. దేవుడు ఆశీర్వదించి నా నెత్తిన రాసిపెడితే నేను ముఖ్యమంత్రినవుతానని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. పులివెందులలో రెండు రోజుల పాటు గడిపిన జగన్‌ ఆదివారం ఉదయం నుంచి ‘ప్రజాదర్బార్‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలు జగన్‌ను కలిసి మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ల ప్రస్తావన తీసుకువచ్చారు. జమ్మలమడుగు నుంచి సుధీర్‌రెడ్డి, మైదుకూరు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వైసీపీ అభ్యర్థులుగా రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారని జగన్‌ కార్యకర్తల ఎదుట ప్రకటించారు. కాగా మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరితే ఎమ్మెల్సీగా అవకాశమిస్తామన్న జగన్‌ మాటలపై డీఎల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గౌరవంగా పార్టీలోకి పిలిచి టిక్కెట్‌ ఇస్తే పోటీ చేస్తామని, అది ఏ పార్టీ అయినా సరేనన్నారు.

రెండు రోజుల పర్యటన 14 నెలల పాటు జనచైతన్యయాత్రలో భాగంగా పాదయాత్ర నిర్వహించి జిల్లాకు విచ్చేసిన జగన్‌కు పెద్ద ఎత్తున కార్యకర్తలు స్వాగతం పలికారు. తొలిరోజు కడపలోని పెద్దదర్గా నుంచి ఆ తరువాత పులివెందులలోని చర్చి, ఇడుపులపాయలోని వైఎస్‌ ఘాట్‌ను సందర్శించి శనివారం రాత్రి పులివెందులలోనే ఉన్నారు. ఆదివారం ఉదయం ప్రజాదర్బార్‌ నిర్వహించగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌ సుధీర్‌రెడ్డి తన అనుచరులతో కలిశారు. అక్కడున్న కార్యకర్తలు ఈసారి సుధీర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని జగన్‌ దృష్టికి తెచ్చారు. మీకందరికీ ఇష్టమైతే మీ అభ్యర్థి సుధీర్‌రెడ్డే. ఇప్పుడే ప్రకటిస్తున్నా, గెలిపించుకురండి, ఆ బాధ్యత మీదే..అంటూ జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి సుధీర్‌రెడ్డేనని తేల్చి చెప్పారు. ఇది తెలుసుకున్న మైలవరం మాజీ మండలాధ్యక్షురాలు అల్లె ప్రభావతి తన అనుచరులతో జగన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా ఆమె అనుచరులు అన్నా.. ఈసారి అల్లె ప్రభావతికి టికెట్‌ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుని మీముందుకు వస్తామన్నారు. దీంతో జగన్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే టికెట్‌ ఒకరికే ఇస్తాం. అబద్దాలు చెప్పడం, మోసం చేయలేను. సుధీరే క్యాండెట్‌, నా మీద ఏమాత్రం అభిమానం, నమ్మకం ఉన్నా సుధీర్‌కు సపోర్టు చేయండి.
దేవుడు ఆశీర్వదించి నా నెత్తిన రాసిపెడితే నేను ముఖ్యమంత్రినవుతాను. నేను ముఖ్యమంత్రి అయిన రోజు అందరికీ మంచి చేస్తాను. ఆ మంచి చేసే బాధ్యత నాదే. మీరు బయటికి వెళ్లి సుధీర్‌రెడ్డే క్యాండెట్‌ అని స్టేట్‌మెంట్‌ ఇవ్వండి, మనస్ఫూర్తిగా అక్క చేత స్టేట్‌మెంట్‌ ఇప్పించండన్నారు.

దీంతో అల్లె ప్రభావతి జగన్‌.. నీవు నన్ను సామాన్య కార్యకర్తగా చూస్తున్నావు. జిల్లా మహిళా అద్యక్షురాలుగా అవకాశమివ్వండి అని ముందే చెప్పాను. ఆదినారాయణరెడ్డి మన పార్టీలో ఉండడని ఆరోజు మీరు వినకుండా టికెట్‌ ఇచ్చి గెలిపించారు. మరి ఏం జరిగింది..? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కార్యకర్తలు అక్కకు ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇస్తానని హామీ ఇవ్వండి అనడంతో నా కోసం, నా తమ్ముడి కోసం ఇంత మంది సాక్షిగా అక్క ప్రభావతి బయట సుధీర్‌కు సపోర్టు చేస్తానని స్టేట్‌మెంట్‌ ఇవ్వాలి అంటూ జగన్‌ సముదాయించారు. ఆ తరువాత మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి జగన్‌ను కలిశారు. మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి పార్టీలోకి వస్తానంటే తనకు అభ్యంతరం లేదని, కలిసే పనిచేస్తామని డీఎల్‌ను పార్టీలోకి ఆహ్వానించండి అని సూచన చేశారు.

అంతకు ముందు రోజు డీఎల్‌ అనుచరులు వీరన్నగట్టుపల్లె వద్ద కలిసి డీఎల్‌కు టికెట్‌ ఇవ్వాలని అలా జరిగితే 50 వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్ధిగా డీఎల్‌ గెలుస్తారన్నారు. కానీ డీఎల్‌ అనుచరులకే జగన్‌ టికెట్‌ ఇవ్వలేమని తేల్చి చెబుతూ అవకాశముంటే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. ఆ తరువాత సాయంత్రం వరకు ప్రజాదర్బార్‌ నిర్వహించిన జగన్‌ హైదరాబాదుకు పయనమయ్యారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో విచ్చేయగా జగన్‌తో సెల్ఫీలతోనే సమయం సరిపోయింది. చివరగా అందరికీ అభివాదం చేస్తూ తొందరలోనే మంచి రోజులు వస్తాయి అధైర్యపడవద్దంటూ భరోసా ఇస్తూ జగన్‌ పయనమయ్యారు.

గౌరవప్రదంగా ఆహ్వానించి టికెట్‌ ఇస్తే పోటీ చేస్తా నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా. ఆరుసార్లు ఎమ్యెల్యేగా గెలిచా. ఎవరైనా గౌరవప్రదంగా పార్టీలోకి ఆహ్వానిస్తే వెళ్లి పోటీ చేస్తాను. ఎవరో ఎమ్మెల్సీ పదవులిస్తే తీసుకునే పరిస్థితిలో లేను. ఎక్కడున్నా సీనియర్‌ నేతగా గౌరవంగా చూసుకుంటేనే ఆ పార్టీలోకి వెళతా. – డీఎల్‌ రవీంద్రారెడ్డి, మాజీ మంత్రి

తాజా సమాచారం