మద్యమే ముద్దు…బీరు వద్దు

మద్యమే ముద్దు…బీరు వద్దు

ఎర్రటి ఎండల్లో చల్లటి బీరు తాగలానుకునే మందుబాబులకు తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖ విచిత్రమైన హుకుం జారీ చేయడానికి సిద్ధమవుతోంది. ఎర్రటి ఎండల్లో కావాలనుకుంటే మద్యం తాగండి కానీ బీరు మాత్రం తాగకండి అంటూ సూచిస్తోంది. దేశంలో బీరు వినియోగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. వేసవి కాలంలో తెలంగాణలో బీరు విక్రయాలు రికార్డు స్థాయిలో ఉంటాయి. అయితే వాటిపై వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడంతో అబ్కారీశాఖ కొత్త తరహా ప్రణాళికకు రూపకల్పన సిద్ధం చేస్తోంది. బీర్ల విక్రయాల కంటే మద్యం విక్రయాలతోనే ఎక్సైజ్‌ డ్యూటీ ఎక్కువగా ఉండడంతో కేవలం ఆదాయం పెంచుకోవడం కోసం బీరు విక్రయాలను త‌గ్గిస్తూ మద్యం అమ్మకాలను పెంచాలని యోచిస్తోంది. కానీ ఎక్సైజ్‌ శాఖ వింత పోకడతో వైన్‌ షాపులు, బార్ల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. లైసెన్సు ఫీజు రూపంలో లక్షలాది రూపాయలు చెల్లిస్తుంటే తమపై అసమంజసమైన నిబంధనలు పెడుతూ నష్టాలకు కారణమవుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇవేవి పట్టించుకోని ఎక్సైజ్‌శాఖ అందుకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని మద్యం డిపోలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసారు. వైన్‌ షాపులు, బార్లు, క్లబ్బులకు బీర్లు సరఫరా చేయరాదని, కేవలం మద్యం మాత్రమే సరఫరా చేయాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 మద్యం డిపోల మేనేజర్లు కేవలం మద్యం కోసం ఆర్డర్లు పెట్టిన బార్లు, మద్యం దుకాణాలకు మాత్రమే సరుకు సరఫరా చేసారు. బీర్ల సరఫరా లేకపోవడంతో విక్రయాలు తగ్గాయని, బీర్ల సరఫరా ఎందుకు నిలిపివేసారంటూ డిపో మేనేజర్లను ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే బీర్ల సరఫరా నిలిపివేసామంటూ బదులిచ్చారంటూ మద్యం దుకాణాల యజమానులు, బార్ల యజమాన్యాలు గోడు వెళ్లబోసుకుంటున్నారు. కాకపోతే ఒక వెసులుబాటు ఇచ్చారు. గురువారం డిపోల నుంచి బీరును లిఫ్ట్‌ చేయాలంటే, 75శాతం మద్యం, 25 శాతం బీరును తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దాంతో యజమానులు ల‌బోదిబో మంటున్నారు. గురువారం ఒక్క రోజు అంత తక్కువ బీరును తీసుకుంటే షాపులను ఎలా నడపాలని వారు వాపోతున్నారు. మరో విచిత్రమేమిటంటే ఎక్సైజ్‌ శాఖ తన మద్యం డిపోలకు మార్చి 1, 2, 3, 4 రోజుల్లో వరుస సెలవులను ప్రకటించింది. 1, 2న శుక్ర, శనివారాలు. ఎలాంటి పండుగలు, డ్రైడేలు లేనప్పటికీ మద్యం సరఫరా చేయరాదంటూ డిపోలను ఆదేశించింది. 3న ఆదివారం, 4న మహాశివరాత్రి కావడంతో సాధారణ సెలవు దినాలుగా యజమానులు అంగీకరిస్తున్నారు. కానీ 1, 2 తేదీల్లో ఎందుకు సెలవులుగా పాటించాలంటూ ప్రశ్నిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos